ఎల్‌పీజీ గ్యాస్.. ఇది వాడుకలోకి వచ్చినప్పటి నుంచి కట్టెల పొయ్యిపై వంట చేయడం తగ్గిపోయింది. ప్రస్తుతం మారుమాల గ్రామాల్లోనూ గ్యాస్‌తోనే వంట చేస్తున్నారు. పొగ కష్టాలు పోయి సులభంగా వంటింటి పని పూర్తి చేసేస్తున్నారు. అయితే.. ఒక్కోసారి అప్రమత్తంగా లేక.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో.. గ్యాస్ బ్లాస్ట్ వంటి ప్రమాదాల్లో చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారమే.. ఇటీవల పెరుగుతున్న గ్యాస్ లీకేజ్ ప్రమాదాలకు కారణంగా నిలుస్తోంది.
ఇటీవలి ఘటనలు..
తాజాగా.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవాని లంకలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో.. తండ్రీకుమారుడు సజీవ దహనం అయ్యారు. కడప జిల్లా రాజంపేట పట్టణం మంగలమిట్టలోని ఓ ఇంట్లో ఆగస్ట్ 20న జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొత్త గ్యాస్ సిలిండర్ అర్చే సమయంలో గ్యాస్ లీక్ అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరూ గమనించకపోవడం.. ఘటనకు కారణమైంది. వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఓ వివాహిత మే నెలలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట బ్రౌనుపేటలో జరిగింది. ఇలాంటి ఘటనలు ఎన్నో. గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో కొంత మంది ప్రాణాలు పోతుండగా.. చాలామంది గాయాలపాలై.. జీవచ్ఛవాల్లా మారుతున్నారు.
చిన్న చిన్న జాగ్రత్తలతో..
గ్యాస్ సిలిండర్ పేలితే ఆ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల కొంతదూరం ప్రభావం చూపిస్తుంది. ప్రమాద తీవ్రత ఆధారంగా.. ఆస్తి, ప్రాణ నష్టానికి అవకాశం ఉంటుంది. వంట చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. పని పూర్తయ్యాక సిలిండర్ నాబ్ ఆఫ్ చేయడం లేదా మర్చిపోవటం వంటి పరిణామాలతోనే.. గ్యాస్ లీకేజ్ అవుతుంటుంది. అందుకే.. సిలిండర్ ఉపయోగించే వారు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. తరచుగా అయినా.. కనీసం వంటింట్లోకి వెళ్లినప్పుడైనా సరే.. గ్యాస్ లీకేజ్ ను చెక్ చేస్తూ ఉండాలి. వంట అయిన తర్వాత సిలిండర్‌ను ఆఫ్ చేయడం ఓ అలవాటుగా మార్చుకోవాలి. స్టవ్‌ను ఎప్పుడూ.. సిలిండర్ కంటే ఎత్తులోనే ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టవ్ కింద పెట్టకూడదు. ఒకవేళ గ్యాస్ వాసన వస్తే మాత్రం జాగ్రత్త పడాలి. అప్పుడే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు.
గ్యాస్ లీక్ అవుతోందని మీకు అనుమానం వస్తే..
- గ్యాస్ లీక్ కనిపెట్టేందుకు అగ్గిపుల్ల అట్టించకూడదు
- గ్యాస్ సిలిండర్ స్టవ్‌కు ఉన్న నాబ్స్‌ను ఆఫ్ చేయాలి
- ఎలక్ట్రిక్ స్విచ్‌లను వేయకూడదు
- తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి
- వంట గది పరిసరాల్లో కొవ్వొత్తులు లాంటివి వెలిగించకూడదు
- అనుమానంపై తక్షణమే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కు సమాచారం ఇవ్వాలి
- అవసరమైతే.. ఇండనే, భారత్, హెచ్ పీ గ్యాస్ లీకేజ్ అత్యవసర నంబర్ 1906కు సమాచారం ఇవ్వాలి.. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
సిలిండర్ నుంచి మంటలు వస్తే ఇలా చేయకండి..
గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకున్నప్పుడు సిలిండర్‌కు వేడి తగలకుండా చెయ్యాలి. సిలిండర్ లోపల ఉండే ద్రవ రూపం.. వాయు రూపంలోకి వస్తే సిలిండర్ పేలిపోయే ఆవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా.. సిలిండర్‌కు మంటలు అంటుకున్నప్పుడు అటూ ఇటూ నెట్టివేయకూడదు. ఆలా చేస్తే సిలిండర్‌కు వేడి తగిలి పేలిపోయే అవకాశం పెరుగుతుంది. మంటలు ఆర్పిన తరువాత సిలిండర్‌పై ఒక గోదాం బస్తా వేసి నీళ్లు పోయాలి.
ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్నవారికి.. ఇన్సూరెన్స్ కవరేజ్..
మైఎల్‌పీజీ.ఇన్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌పీజీ కనెక్షన్ తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సాధారణంగా గ్యాస్ ఏజెన్సీ వారు ఎల్‌పీజీ ఇన్సూరెన్స్ పాలసీ గురించి కస్టమర్లకు తెలియజేయాలి. వారి నోటీస్ బోర్డులో డిస్‌ప్లే చేయాలి. కానీ ఇలా జరగడం లేదు. ఎల్‌పీజీ కంపెనీలు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాయి. దీనికి ఎల్‌పీజీ కస్టమర్ల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయరు. గ్యాస్ సిలిండర్‌కు చిల్లు ఉండటం, లీకేజీ లాంటి కంపెనీలు లోపాలు ఉంటే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
ఎల్‌పీజీ యాక్సిడెంట్ బాధితులు తమ గ్యాస్ ఏజెన్సీ లేదా ఆయిల్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ప్రమాదం వల్ల వల్ల ప్రమాదానికి గురైతే రూ.50 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. పబ్లిక్ లయబిలిటీ పాలసీ కింద పర్సనల్ యాక్సిడెంట్ కవర్, వైద్య ఖర్చుల రీయింబర్స్, ప్రాపర్టీ డ్యామేజ్ కవర్ వంటి సదుపాయాలు పొందొచ్చు. ఇన్సూరెన్స్ మొత్తం అనేది ప్రమాద తీవ్రత, వ్యక్తి ప్రాతిపదికన అందజేస్తారు.
ఎల్‌పీజీ కస్టమర్లు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే డిస్ట్రిబ్యూటర్‌కు తెలియజేయాలి. ఆ ఏజెన్సీ ఆయిల్ కంపెనీ, ఇన్సూరెన్స్ సంస్థకు ఈ విషయాన్ని తెలియజేస్తారు. కస్టమర్లు ఇన్సూరెన్స్ కంపెనీకి దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదు. డెత్ సర్టిఫికెట్స్, పోస్ట్ మార్టం రిపోర్టు, వైద్య బిల్లులు వంటి వాటిని ఆయిల్ కంపెనీకి అందిస్తే సరిపోతుంది. ప్రమాదం వల్ల గ్యాస్ అగ్రిమెంట్‌లోని రిజిస్టర్డ్ ఇంటికి డ్యామేజ్ అయితే.. ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సర్వేయర్‌ను నియమించుకుంటుంది. ఆ సర్వేయర్.. నష్టాన్ని అంచనా వేస్తారు. ఇన్సూరెన్స్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఐఎస్ఐ మార్క్ యాక్సెసరీస్‌నే ఉపయోగించి ఉండాలి.
ఇదీ చదవండి:
Accident: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. నిద్రలోనే తండ్రి, కుమారుడు మృతి