Ganja addicted boy treatment: గంజాయి మత్తుకు బానిసైన సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన 8వ తరగతి విద్యార్థి ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమారుడు గంజాయి సేవిస్తున్నాడన్న ఆగ్రహంతో తల్లి .. బాలుడిని స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పోసి కొట్టడంతో గాయపడ్డాడు. గంజాయి అధిక మోతాదులో తీసుకోవడంతో బాలుడికి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు తలెత్తినట్టు గాంధీ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.
ఏడాది నుంచి తోటి స్నేహితులతో కలిసి నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయి సేవిస్తూ, ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే మత్తులో తూగుతూ ఉండే వాళ్లమని విద్యార్థి తెలిపాడు. ఒక సారి ఫ్రెండ్ ద్వారా గంజాయి సేవించడంతో దానికి బానిసయ్యానని వివరించాడు. అరకు నుంచి గంజాయి వస్తుందని, ఒక్కో పొట్లం రూ.500 చొప్పున కొనుగోలు చేస్తున్నామని తెలిపాడు. తాము కూలి పనులకు ఉదయం వెళ్లి రాత్రికి ఇంటికి వస్తామని, కుమారుడు గంజాయి సేవిస్తున్న విషయం ఆలస్యంగా గుర్తించామని విద్యార్థి తండ్రి మీడియాకు వెల్లడించారు.
"గంజాయి తాగుతున్నానని మా అమ్మ కళ్లల్లో కారం పోసి కొట్టింది. మా స్నేహితుల వల్ల అలవాటు అయింది. సంవత్సరం నుంచి గంజాయి తాగుతున్నా. మా స్నేహితుల నేర్పించడం వల్ల అలవాటు అయింది. అరకు నుంచి గంజాయి వస్తుంది." -గంజాయికి బానిసైన విద్యార్థి
"మా ఆవిడ ఇంట్లో పొట్లాన్ని చూసి పట్టుకుంది. కళ్లల్లో కారం పోసి కొట్టింది. వాడు పొద్దున 9గంటలకు వెళ్లి రాత్రి వస్తాడు. ఎక్కడకు వెళ్లావని ప్రశ్నిస్తే ఏం చెప్పడు." -విద్యార్థి తండ్రి
ఇదీ చదవండి: గంజాయికి బానిసైన కొడుకు.. స్తంభానికి కట్టేసి కంట్లో కారం కొట్టిన తల్లి