ఫాక్స్ కాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జోష్ ఫాల్జర్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మర్యాదపూర్వరంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సంస్థ కార్యకలాపాలను సీఎంకు వివరించారు. నెల్లూరు జిల్లా శ్రీసిటీలో ఉన్న తమ సంస్థ లో 15 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని.. వారందరికీ వృత్తిపరమైన శిక్షణ ఇచ్చామని వివరించారు. ఈ ఏడాది నుంచి కంపెనీ ఉత్పాదక సామర్థ్యం పెంచబోతున్నామని , నెలకు 35 లక్షల సెల్ ఫోన్లను విక్రయిస్తున్నామని వెల్లడించారు.
ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: సీఎం
ఎలక్ట్రానిక్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త అవకాశాలను కూడా అందిపుచ్చుకునేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఫాక్స్ కాన్ ఎండీకి తెలిపారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ హబ్ గా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాల అనుకూల ప్రాంతమని.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఉత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయడానికి అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్న ముఖ్యమంత్రి జగన్, ఆ దిశగా ఫాక్స్ కాన్ సంస్థ కూడా ముందుడుగు వేయాలని ఆకాంక్షించారు.