హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి ఘటనలో నలుగురు నిందితులను చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో టెక్నిషియన్ ఉమామహేశ్వర్, సెక్యూరిటీ సిబ్బందితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు.
సీసీ కెమెరా మాయం!
ఈ ఘటనపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. బాధిత మహిళ కనిపించిన స్థలంలో ఆధారాలు సేకరించారు. అయితే ఓపీ పక్కన ఉన్న షెడ్‌లో ఎక్కడా సీసీ కెమెరా కనిపించకపోవడం గమనార్హం.
ముమ్మర గాలింపు
మరోవైపు బాధితురాలి సోదరి కోసం పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. గాంధీ ఆస్పత్రిలో అత్యాచారం జరిగిందని ఓ మహిళ సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో పాటు సోదరిపైనా అత్యాచారం జరిగిందని ఆమె తెలిపారు.
ఏం జరిగింది?
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఈ నెల 5న గాంధీ ఆసుపత్రిలో చేరారు. భార్య, మరదలు ఆయనకు సహాయకులుగా వచ్చారు. కుమారుడు రోజూ ఆస్పత్రికి వచ్చి వెళ్లేవాడు. ఆసుపత్రిలోని రేడియోగ్రాఫర్ ఉమామహేశ్వర్ ఆ మహిళలకు దూరపు బంధువుకావడంతో.. వారు అతడితో మాట్లాడేవారు. ఈ నెల 8 నుంచి అక్కాచెల్లెళ్లిద్దరూ కనిపించలేదు. రోగి కుమారుడు వెళ్లి ఉమామహేశ్వర్‌ను అడగ్గా.. విషయం వెలుగులోకి వచ్చింది.
దర్యాప్తు ముమ్మరం
ఉమామహేశ్వర్ ఈ నెల 8న ఆ మహిళలను ఒక గదికి తీసుకెళ్లి కల్లులో మత్తుమందు కలిపి తాగించాడని తెలుస్తోంది. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత.. ఉమామహేశ్వర్‌తో పాటు మరికొందరు వారిపై సామూహికంగా అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారని వెల్లడించారు. మర్నాడు వారిద్దరినీ సెల్లార్‌లోని చీకటి గదిలోకి తీసుకెళ్లి మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారని చెప్పారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు... దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: సెలవుల పెళ్లికొడుకు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ముసుగులో మోసాలు!