తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడ ఉలిక్కిపడింది. అక్కడి వింధ్య ఆర్గానిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి అగ్ని కీలలు భారీగా ఎగసిపడ్డాయి. రోజులాగే విధుల్లో ఉన్న కార్మికులు ఊహించని ఘటనకు బెంబేలెత్తిపోయారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే భయంతో చుట్టుపక్కల పరిశ్రమల్లోని సిబ్బంది కూడా బయటకు వచ్చేశారు. ప్రమాదంలో 8 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులకు బాచుపల్లిలోని సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు పరిశ్రమలో భవనం పైకప్పు తునాతునకలైంది.
తప్పిన పెను ప్రమాదం
ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. పరిశ్రమలో దట్టంగా పొగలు అలుముకోవటంతో కాసేపు సహాయ చర్యలకు ఆటంకం తలెత్తింది. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. సమీప ఫ్యాక్టరీల్లోని రియాక్టర్లను చల్లబరిచారు. భోజన విరామ సమయంలో ప్రమాదం జరగటం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఇదీ చదవండి