Farmers padayatra: రాజధాని రైతుల మహాపాదయాత్ర రోజురోజుకూ మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. 15వ రోజు ఏలూరు జిల్లా కొనికి నుంచి రైతుల పాదయాత్ర మొదలైంది. మహిళా రైతులకు పూలు అందించి స్థానికులు స్వాగతం పలికారు. సకలకొత్తపల్లి గ్రామస్థులు పాదయాత్ర రథానికి ప్రత్యేక పూజలు చేశారు. రైతుల పాదయాత్రను కడిమిగుంట గ్రామస్థులు పూలతో స్వాగతించారు. దారిపొడవునా రైతులకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. మజ్జిగ ప్యాకెట్లు, నీళ్లు అందించారు. రాజధాని రైతులకు మద్దతు తెలియజేశారు. ఏలూరు, గుడిపాడు, హనుమాన్ జంక్షన్, విజయరాయి నుంచి తరలివచ్చిన జనం రైతులతో కలిసి పాదం కదిపారు. రైతులకు న్యాయం చేయాలని.. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరారు.
రైతుల మహా పాదయాత్రకు ఏలూరు వైద్యులు సంఘీభావం తెలిపారు. రైతుల వెంట నడిచి మద్దతు తెలిపారు. ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్చడాన్ని తప్పుబట్టారు. రైతుల పాదయాత్రకు తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్.. పూలతో స్వాగతం పలికారు. పాదయాత్రలో తెదేపా నేతలు నిమ్మల రామానాయుడు, మాగంటి బాబు, రామరాజు, గన్ని వీరాంజనేయులు, జవహర్ పాల్గొన్నారు. అంతిమ విజయం రైతులదేనన్నారు.
కాళ్లు నొప్పులను భరిస్తూ ముందుకు సాగుతున్న రైతులు.. ప్రభుత్వ తీరును, మంత్రుల వ్యాఖ్యలను తప్పుబట్టారు. సీఎం జగన్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనికి నుంచి పెదపాడు మీదుగా ఏలూరు సమీపంలోని కొత్తూరు వరకు పాదయాత్ర సాగింది. 15వ రోజు 15 కిలోమీటర్లు మేర రైతులు కదం తొక్కారు.
ఇవీ చదవండి: