Forest officer harassment: అటవీ శాఖలో ఓ ఉన్నతాధికారి కొంతకాలంగా తనను వేధింపులకు గురి చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అదే శాఖలోని మహిళా సూపరింటెండెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై మహిళా కమిషన్, అటవీ, పర్యావరణశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోగా.. వేధింపులు ఎక్కువయ్యాయని ఆమె వాపోయారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు. కొంతకాలంగా ఉన్నతాధికారి తనను వేధింపులకు గురి చేస్తున్నారని, దీనిపై రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్‌కు, కేంద్ర, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశానని సీఎస్‌కు రాసిన లేఖలో వివరించారు.
దీనిపై మహిళా కమిషన్.. సంబంధిత అధికారిని విచారణకు పిలిస్తే, మహిళా అధికారితో విచారణ చేయించి నివేదికను పంపుతామని పేర్కొన్నారన్నారు. కానీ ఆయనే స్వయంగా విచారణ చేపట్టి తప్పుడు నివేదికను రూపొందించారని సీఎస్ దృష్టికి తెచ్చారు. వేధింపుల ఫిర్యాదుపై ఇప్పటి వరకు నివేదిక రాలేదని.., రాష్ట్ర మహిళా కమిషన్ లేఖ రాసినా.. సమాధానం లేదని, చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ పోలీసులకు సూచించినా వారిపై ఒత్తిడి తెచ్చి చర్య తీసుకోకుండా చేశారన్నారు. తనపై అధికారి విచారణ చేసి ఇచ్చిన నివేదికలో నోట్స్ సరిగా రాయలేదని లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా తాను మానసిక క్షోభను అనుభవిస్తున్నానని వివరించారు. ‘ఆయనపై చర్య అయినా తీసుకోండి లేదా నాకు వీఆర్‌ఎస్ ఇచ్చి అయినా పంపండి’ అని సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఓ జిల్లా కేంద్రంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఈ మహిళా అధికారి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఆధారాలను జత చేశారు.
ఇవీ చదవండి: