రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ... రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు 52వ రోజుకు చేరాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడితో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల పరిధిలో రైతులు దీక్షలు కొనసాగించారు. "మూడు రాజధానులు వద్దు-అమరావతే ముద్దు”, "సేవ్ ఏపీ-సేవ్ అమరావతి" నినాదాలతో హోరెత్తించారు. తుళ్లూరు, మందడంలో మహాధర్నాల్లో భారీ సంఖ్యలో మహిళలు, రైతులు పాల్గొన్నారు. వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు.
అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని... మహిళలు, రైతులు స్పష్టం చేస్తున్నారు. అమరావతి అభివృద్ధికి లక్ష కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుందన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరు రైతులకు తెదేపా నేత దేవినేని ఉమా సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులకు ఇతర ప్రాంతాల ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజలతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చినవారు... రైతుల ఆందోళనల్లో పాల్గొన్నారు.
తాళ్లాయపాలెంలో మహిళా రైతులు జలదీక్ష చేపట్టి అమరావతి ఆకాంక్షను చాటారు. కృష్ణమ్మకు హారతులు పట్టి అమరావతి కోసం ప్రార్థించారు. ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్న తీరు... ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం దెబ్బతినేలా ఉందని మండిపడ్డారు. వెలగపూడిలో యువకులు చేపట్టిన 151 గంటల దీక్షకు... రాయలసీమ నుంచి వచ్చిన రైతులు మద్దతు తెలిపారు. మందడంలో 24 గంటల దీక్షలో కూర్చున్న రైతులు... ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ...రాష్ట్రాభివృద్ధికి ఏఐఐబీ దన్ను..!