సకాలంలో పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల విద్యుదాఘాతంతో మృతి చెందిన ఓ రైతు కుటుంబం రైతు బీమా నగదు పొందలేకపోయిందని ఆగ్రహం చెందిన రైతులు.. తహసీల్దార్‌పై డీజిల్ పోశారు. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా శివ్వంపేటలో చోటుచేసుకుంది.
ఈనెల 28న తాళ్లపల్లి తండాలో మాలోత్ బాలు అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అతనికి సకాలంలో పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వక పోవడం వల్ల మృతుని కుటుంబం రైతు బీమా పథకం లబ్ధి పొందలేకపోయిందని స్థానిక రైతులు ఆరోపించారు. పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వని తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు బాలు మృతదేహంతో శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ భానుప్రకాశ్ కార్యాలయం నుంచి బయటకు వెళ్తుండగా ఓ రైతు అతనిపై డీజిల్ పోశాడు. పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తం అవ్వడం వల్ల పెనుప్రమాదం తప్పింది.
ఇదీ చదవండి : Ruia Case: రుయా ఆసుపత్రిలో హత్య కేసు.. సీసీటీవీ ఫుటేజీ విడుదల