Engineering faculty shortage: ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్సు (సీఎస్‌ఈ), ఎమర్జింగ్ కోర్సుల బోధనకు అధ్యాపకుల కొరత ఏర్పడింది. విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్‌తో కళాశాలలు ఈ బ్రాంచిల్లో అధికంగా సెక్షన్లు పెంచారు. కానీ వారికి బోధించేందుకు ఎంటెక్ పూర్తి చేసిన వారు తక్కువగా ఉన్నారు. డిజిటలీకరణతో సీఎస్‌ఈ చదివిన వారికి ఉద్యోగావకాశాలు పెరగడంతో తల్లిదండ్రులు, పిల్లలు ఆ కోర్సులు చదివేందుకే ఆసక్తి చూపుతున్నారు. బీటెక్ పూర్తి చేసే సమయంలోనే ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు లభిస్తుండడంతో చాలా మంది ఉన్నత చదువులపై ఆసక్తి చూపడం లేదు. ఎంటెక్ చేసినా అదనంగా జీతాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో బీటెక్‌తోనే ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నారు. ఇంజినీరింగ్‌లో అధ్యాపకులకు వేతనాలు తక్కువగా ఉండడంతో ఈ వృత్తిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. మరికొంత మంది విదేశాల్లో పీజీలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. 2015-16లో బీటెక్ చేసిన వారు 74,279 మంది ఉంటే... అందులో 11,752 మంది ఎంటెక్ ప్రవేశాలు పొందారు. 2020-21లో 92,111 మంది బీటెక్ చేస్తే.. అందులో 5,570 మంది మాత్రమే ఎంటెక్ చదివేందుకు ఆసక్తి చూపారు. దాదాపు సగం మంది ఎంటెక్ వైపు మొగ్గు చూపలేదు.
ఔట్ సోర్సింగ్‌కు బోధన
అధ్యాపకుల కొరతను ఎదుర్కొనేందుకు కొన్ని కళాశాలలు బోధనను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగిస్తున్నాయి. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రల్లో బైట్ ఎక్స్‌ల్ అనే సంస్థ అధునాతన కోర్సులపై ఆన్‌లైన్‌లో బోధన అందిస్తోంది. తరగతిలో స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈసంస్థకు చెందిన నిపుణులు ఆన్‌లైన్ ద్వారా బోధన అందిస్తున్నారు. మరికొన్ని కళాశాలలు మూక్స్‌లోని వీడియోలను తరగతిలో ప్రదర్శిస్తున్నాయి. సందేహాలుంటే అధ్యాపకులు నివృత్తి చేస్తున్నారు.
పని గంటలు పెంపు..
అధ్యాపకుల కొరతను ఎదుర్కొనేందుకు కళాశాలలు అధ్యాపకుల పని గంటలను పెంచేశాయి. అత్యవసర అధ్యాపకుల కింద ఐఐటీ, నిట్, ట్రిపుల్‌ఐటీ, పదవీవిరమణ పొందిన వారు, పరిశ్రమల్లో పని చేస్తున్న వారితోనూ కొన్ని కళాశాలలు అతిథి బోధనను ఇప్పిస్తున్నాయి. కొన్ని కళాశాలలు శని, ఆదివారాల్లో ఈ తరగతులు నిర్వహిస్తుండగా.. మరికొన్ని వారంలో 3 రోజులు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాయి.
అత్యవసర అధ్యాపకులతో సమస్యకు పరిష్కారం..
‘‘అత్యవసర అధ్యాపకుల కింద పదవీ విరమణ పొందిన, పరిశ్రమల్లో పని చేస్తున్న, కేంద్ర, రాష్ట్ర సాంకేతిక విద్యాసంస్థల్లో పని చేస్తున్న వారి సేవలను వినియోగించుకోవచ్చని ఏఐసీటీఈ సూచించింది. అతిథి అధ్యాపకులుగా వీరిని తీసుకుంటే అధ్యాపకుల సమస్య కొంతవరకు తీరుతుంది. ఎంఎస్సీ, ఎంసీఏ చేసినవారు కొన్ని సబ్జెక్టులు చెప్పేందుకు అనుమతించాలి’’ -గంగిరెడ్డి, ఛైర్మన్, ఏపీ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్
అధ్యాపకులకు ఆఫర్లు..
కొన్ని కళాశాలలు అధ్యాపకులు సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేస్తే అందుకు అయ్యే వ్యయంతో పాటు వేతనాన్ని పెంచుతామని ఆఫర్లు ఇస్తున్నాయి. విజయవాడ శివారులోని ఓ కళాశాల ఇటీవల 15మంది అధ్యాపకులకు ఇలాంటి అవకాశమే కల్పించింది. కోర్సు పూర్తయ్యే వరకు వేతనాన్ని అందిస్తున్నాయి. అనుభవం, నాలెడ్జ్ ఉన్న అధ్యాపకులు కళాశాల విడిచి వెళ్లిపోకుండా ఉండేందుకు వేతనాలు పెంచాయి. అయితే, ఏఐసీటీఈ సూచించిన పేస్కేల్స్ మాత్రం ఇవ్వడం లేదని అధ్యాపకులు వెల్లడిస్తున్నారు.
- ఎమర్జింగ్ కోర్సులపై పట్టు ఉండి, పీహెచ్‌డీ పూర్తి చేసిన అధ్యాపకులకు విపరీతమైన డిమాండ్ ఉంది. చిత్తూరులోని ఒక కళాశాల నుంచి సుమారు 10మంది పీహెచ్‌డీ అధ్యాపకులను ఇటీవల అమరావతిలోని ఓ ప్రైవేటు వర్సిటీ ఎక్కువ వేతనాలతో తీసుకుంది.
- పీహెచ్‌డీ కలిగిన ఓ అధ్యాపకురాలికి ఇంజినీరింగ్ కళాశాల రూ.12లక్షల వార్షిక వేతనం ఇస్తుండగా.. సింగపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ రూ.18లక్షల వేతనంతో ఆమెను తీసుకుంది.
- సివిల్, మెకానికల్ అధ్యాపకులకు మాత్రం డిమాండ్ లేకుండా పోయింది.
ఇదీ చదవండి..
Omicron Cases in AP: రాష్ట్రంలో మరో 10 ఒమిక్రాన్ కేసులు నమోదు..