New Medical Colleges రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు నెలకొల్పుతున్నామంటూ.. ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులు ఆర్భాటంగా చెప్తున్నా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అవన్నీ కార్యరూపందాల్చేలా లేవు. ఎందుకంటే ఎక్కడా ఒక్క భవన నిర్మాణం కూడా పూర్తవలేదు. పులివెందుల, పాడేరు, అనకాపల్లిలో కళాశాలల నిర్మాణాల్లో కాస్త పురోగతి కనిపిస్తున్నాయి. మిగతా చోట్ల అంతంత మాత్రంగా సాగుతున్నాయి. అనకాపల్లిలో స్థల సమస్య రావడంతో, నర్సీపట్నానికి మార్చారు. పులివెందుల, పాడేరు, అనకాపల్లి, పిడుగురాళ్ల, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, మార్కాపురం, పెనుకొండ, మదనపల్లి, ఆదోని, పార్వతీపురంలో వైద్య కళాశాలలు రావాలంటే అక్కడ 300 పడకలతో రోగులకు నిరాంటకంగా మూడేళ్లపాటు చికిత్స అందించాలి.
ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభానికి దరఖాస్తు చేసేందుకు వీలు: అలాగే 30 పడకలు ఎమర్జెన్సీ విభాగంలో ఉండాలి. 300 పడకల అవసరాలకు తగ్గట్లు వ్యాధి నిర్ధారణ యంత్రాలు, పరికరాలు సమకూరాలి. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది నియామకాలు జరగాలి. 300 పడకలకు తగ్గట్లు నిర్మాణాలు పూర్తవ్వాలంటే వచ్చే ఏడాది డిసెంబరు వరకూ పట్టొచ్చని అంచనా. ఒకవేళ వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తై, మూడేళ్లపాటు 300 పడకలతో ఆసుపత్రులు కొనసాగితేనే ఎంబీబీఎస్‌లో తరగతుల ప్రారంభానికి దరఖాస్తు చేసేందుకు వీలుంటుంది. వైద్య కళాశాలలు రావాలంటే 300 పడకలతో అనుబంధ ఆసుపత్రులు ఏర్పాటై తప్పనిసరిగా మూడేళ్లపాటు నడవాలి. అంటే.. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి సిద్ధమైనప్పటికీ వాటిలో తరగతులుప్రారంభించాలంటే 2026 లేదా 2027 వరకు సమయం పడుతుంది. జాతీయ వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం ఆసుపత్రులు నడిపి, మౌలిక సదుపాయాలు కల్పించి యూజీలో సీట్ల కేటాయింపు కోసం దరఖాస్తు చేస్తేనే, ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీల కోసం రాష్ట్రానికి వస్తాయి. అప్పటివరకు ఇక్కడ జరిగే నిర్మాణాలతో జాతీయ వైద్య మండలికి సంబంధం ఉండదు.
ఐదింటికి మాత్రమే కేంద్రం ఆమోదం: కొత్తగా వైద్య కళాశాలల స్థాపనలో అనేకరకాల సమస్యలున్నాయి. ముఖ్యంగా నిధుల సంక్షోభం వెంటాడుతోంది. 17 వైద్యకళాశాలల ఏర్పాటుకు రూ.7880 కోట్లు కావాలి. ప్రస్తుత కళాశాలలు, బోధనాసుపత్రుల అభివృద్ధికి మరో రూ. 3,820 కోట్లు కావాలి. అంటే అన్నింటికీ కలిపి రూ.11,700 కోట్లు కావాలి. కేంద్రం ఇప్పటిదాకా పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం కళాశాలలకు 195 కోట్ల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కొంతమేర నిధులు వచ్చాయి. పాలకొల్లు,బాపట్ల, మదనపల్లి, పెనుకొండ, నర్సీపట్నం, మార్కాపురం, ఆదోనిలో కళాశాలలకు కూడా ఆర్థిక సాయం అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వీటిపై కేంద్ర ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలివ్వడానికే ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. అలాంటిది రూ.11,700 కోట్లు కావాలనే స్పష్టత లేకుండాప్రభుత్వం ఏకకాలంలో 17 వైద్య కళాశాలలు ప్రారంభించేలా హడావుడి చేస్తోంది. 17 వైద్యకళాశాలల ప్రతిపాదనల్లో. ఐదింటికి మాత్రమే నిధులకు కేంద్రం నుంచి ఆమోదం ఉంది.
బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు: బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం ప్రతిపాదించిన రీపేమెంట్ విధానం సంతృప్తికరంగా లేనందున అవి రుణాలు ఇచ్చేందుకు సంశయిస్తున్నాయి. ఏదోలా వచ్చేస్తాయన్న ఉద్దేశంతో నిర్మాణాలు ప్రారంభించినా నిధుల లభ్యతను బట్టి మాత్రమే ఇవి వేగాన్ని అందుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం అనుమతిచ్చిన 5 కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు జరుగుతాయని చెప్తోంది. కానీ జాతీయ వైద్య మండలి- (ఎన్ఎంసీ) నుంచి అనుమతి లభించే వరకూ చెప్పలేని పరిస్థితి. ఇవన్నీచూస్తే ముఖ్యమంత్రి జగన్ పదవీకాలం పూర్తయ్యేలోగా .. అన్నీ ప్రణాళికా ప్రకారం జరిగితే 5 వైద్య కళాశాలలుమాత్రమేఅందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: