అధిక వర్షాలతో ఉద్యాన పంటలకు తెగుళ్లు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం డీ కొండాపురం గ్రామంలోని పంటలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. అధిక వర్షాల దాటికి ఉల్లి పంటకు తెగుళ్లు సోకాయన్నారు. ఫలితంగా వేలాది రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోనే 325 హెక్టార్లలో ఉల్లి, 240 హెక్టార్లలో టమాటా పంటను సాగు చేశారని కాల్వ తెలిపారు. రైతు ప్రభుత్వమని చెప్పే వైకాపా... క్షేత్రస్థాయిలో మాత్రం రైతులను పట్టించుకోవటం లేదని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలతో ఎలాంటి లాభం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యాన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు పంట నష్టంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఖర్చులు, కూలీల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశామన్నారు. తక్షణమే ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి
Telangana: బీ అలర్ట్.. గాలి ద్వారా డెల్టా వేరియంట్ వ్యాప్తి: డీహెచ్ శ్రీనివాసరావు