ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) కన్నుమూశారు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను స్టార్ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఉదయం 8.20 గంటలకు రోశయ్య మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అమీర్‌పేట్‌లోని నివాసంలో రోశయ్య భౌతికకాయాన్ని ఉంచారు. రోశయ్య భౌతికకాయానికి ప్రముఖులు, బంధువులు నివాళులర్పిస్తున్నారు. రోశయ్యతో తమకున్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. రేపు ఉదయం వరకు నివాసంలోనే రోశయ్య భౌతికకాయం ఉంచనున్నారు. ప్రజల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు గాంధీభవన్‌లో ఆయన భౌతికకాయం ఉంచనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రోశయ్య మృతిపట్ల తెలంగాణ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. మూడు రోజులు సంతాప దినాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం కూడా రోశయ్య ఆకస్మిక మృతికి సంతాప సూచకంగా 3 రోజులపాటు (డిసెంబర్ 4 నుంచి 6వరకూ) సంతాప దినాలు ప్రకటించింది. రోషయ్య అంత్యక్రియల్లో ఏపీ నుంచి మంత్రులు బొత్స, బాలినేని, వెల్లంపల్లి పాల్గొననున్నారు.
నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు..
1933 జులై 4న గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ చదివారు. స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడుగా.. నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికైన రోశయ్య.. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.
రోశయ్య నిర్వర్తించిన మంత్రిత్వ శాఖలు
- 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు
- 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ
- 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్తు శాఖలు
- 1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు
- 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు
- 2004, 2009లో వై.యస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు
- 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు.
- 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
15 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత..
ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా రోశయ్య పనిచేశారు. 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇందులో చివరి 7 సార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరొందారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24న తన పదవికి రాజీనామా చేశారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేపట్టి.. 2016 ఆగస్టు 30 వరకూ సేవలు అందించారు.
గౌరవ డాక్టరేట్..
2007లో రోశయ్యకు ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. 2018 ఫిబ్రవరి 11న లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడుగా పేరుతెచ్చుకున్న రోశయ్య... నిబద్ధత, సౌమ్యత, విషయ స్పష్టతతో సేవలు అందించారు. ఆంధ్ర ఉద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆ సమయంలోనే ఉపరాష్ట్రపతి వెంకయ్యతో పరిచయం ఏర్పడింది.
ఇదీ చూడండి:
JAWAD CYCLONE EFFECT IN AP: తీవ్ర తుపానుగా జవాద్... రేపు తీరం దాటే అవకాశం