Ex Chairman of Apco has approached the High Court: సీఐడీ తమపై 2020 నవంబర్‌లో నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ఆ కేసు ఆధారంగా దిగువ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేయాలని ఆప్కో మాజీ ఛైర్మన్ గుజ్జల శ్రీను, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు కోర్టు ముందు ఉంచిన తీర్పులను అధ్యయనం చేసేందుకు సమయం కావాలని సీఐడీ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. దీంతో విచారణను ఈ నెల 29కి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య ఆదేశాలు జారీ చేశారు. చేనేత కార్మికుల పేరిట నకిలీ సంఘాలు, ఖాతాలు సృష్టించి రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ 2020 నవంబర్‌లో ఆప్కో మాజీ ఛైర్మన్ గుజ్జల శ్రీను మరికొందరిపై సీఐడీ కేసు నమోదు చేసింది.
దానిపై ప్రస్తుతం కర్నూలులోని అనిశా కోర్టులో విచారణ జరుగుతోంది. సీఐడీ కేసును కొట్టేయాలని శ్రీను, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. గుజ్జల శ్రీను తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, ఇతర నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ.. ‘వార్తా కథనాల ఆధారంగా పిటిషనర్లపై కేసు నమోదు చేసి, సీఐడీ వేధిస్తోంది. అవినీతి నిరోధక చట్టం కింద ఈ వ్యవహారంలో కేసు నమోదు చేయడానికి వీల్లేదు. శ్రీను ఆప్కో ఛైర్మన్‌గా ఉన్నప్పుడు రూ.27 కోట్లు మాత్రమే వచ్చాయి. సీఐడీ రూ.242 కోట్ల అక్రమాలు జరిగినట్లు చెబుతోంది. సీఐడీ వాదనల్లో వాస్తవం లేదు. ఆవినీతి జరగలేదు. పిటిషనర్లపై కేసును కొట్టేయండి’ అని కోరారు.
174 మంది సాక్షుల్ని విచారించాం
సీఐడీ తరఫు న్యాయవాది శివ కల్పన వాదనలు వినిపిస్తూ.. ఆప్కో ఛైర్మన్ పబ్లిక్ సర్వెంట్ కాబట్టి అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందన్నారు. 174 మంది సాక్షులను విచారించి దిగువ కోర్టులో అభియోగపత్రం వేశామన్నారు. 2008-18 మధ్యలో నకిలీ ఖాతాలు సృష్టించి రూ.వందల కోట్లు దోచుకున్నారన్నారు. ఆప్కోకు అనుబంధంగా ఉన్న చేనేత సంఘాల సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న వివిధ పథకాల రాయితీలను నకిలీ సంఘాలకు మళ్లించారన్నారు. గుజ్జల శ్రీనివాస్‌కు కడపలోనే 89 స్థిరాస్తులున్నాయన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా దిగువ కోర్టులో విచారణ జరగాల్సి ఉందన్నారు. వ్యాజ్యాలను కొట్టేయాలని కోరారు.
ఇవీ చదవండి: