కొవిడ్ మహమ్మారి కోరలు చాస్తున్న వేళ గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో అద్దె ఇంటి వాసులు ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం రాజధానికి వచ్చిన వారు కరోనా మహమ్మారి విజృంభణతో బెంబేలెత్తుతున్నారు. కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు హైదరాబాద్లో లాక్డౌన్ విధిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సొంతూళ్లకు పయనమవుతున్నారు.
మహమ్మారి దెబ్బకు ఉపాధి కరవు..
కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల చిరు వ్యాపారస్తులు, ఉద్యోగులు, ఇళ్ల కిరాయిలు, వ్యాపార సముదాయాల రెంట్లు భారమై కట్టలేక ఖాళీ చేస్తున్నారు. కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి తిరిగి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. ఓవైపు హయత్నగర్, ఎల్బీనగర్ మొదలుకుని మల్కాజిగిరి, నాగారం దాకా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఖైరతాబాద్, కూకట్పల్లి నుంచి ముషీరాబాద్, బోలక్పూర్ వరకూ నగర వ్యాప్తంగా ఇదే దుస్థితి ఆవరించింది.
చంపాపేట్, సరూర్నగర్ నుంచి మలక్పేట వరకు కిరాయిదారులకు పనిలేక... జీతాలు రాక.. ఇల్లు గడవని దుస్థితి నెలకొంది. సికింద్రాబాద్ అల్వాల్, బొల్లారం బజార్ నుంచి బోయిన్పల్లి, మేడ్చల్ వరకు జనాలు గ్రామాల బాట పడుతున్నారు. మెహదీపట్నం, గచ్చిబౌలి నుంచి ఆరాంఘర్, రాజేంద్రనగర్ దాకా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే కిరాయి ఇళ్లు ఖాళీ చేసి వెనక్కి వెళ్లిపోతున్నామని బాధితులు స్పష్టం చేశారు.
అద్దెలతోనే జీవనం.. పన్నులు మాఫీ చేయాలి
గతంలో వ్యవసాయం చేసి ఉపాధి పొందే వాళ్ళమని.. ఇప్పుడు చుట్టుపక్కల ఐటీ కంపెనీలు రావడం వల్ల భూములకు రెక్కలు వచ్చి వ్యవసాయం పోయిందన్నారు. ఈ క్రమంలో ఉన్న 200, 100 గజాల స్థలంలో రెండు మూడు అంతస్తులు ఇంటిని నిర్మించుకుని.. వాటి ద్వారా వచ్చే అద్దెలతోనే జీవనం సాగిస్తున్నామన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని విద్యుత్ ఛార్జీలు నీటి బకాయిలు పన్నులను మాఫీ చేయాలని ఇంటి యజమానులు విజ్ఞప్తి చేశారు.
నగరంలోనూ ఉపాధి హామీ..
కొవిడ్ లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు నగరంలో అద్దెలు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనులను నగరంలోనూ చేపట్టాలని కోరుతున్నారు. నగరవాసులకు ఉపాధి హామీ పథకంలో భాగంగా పని కల్పించాలని విన్నవించారు.
కుదేలైన వ్యాపారాలు
భాగ్యనగరంలో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతుండటం వల్ల ప్రజలు బయటికి వచ్చి షాపింగ్, భోజనాలు చేసే పరిస్థితి లేదు. రోజుకు సుమారు రూ.10 లక్షల వ్యాపారం జరిగే వ్యాపారస్తులకు.. కరోనా ధాటికి నెలకు కనీసం రూ.లక్ష కూడా లావాదేవీలు జరగట్లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. చిన్న పెట్టుబడులతో నడిచే హోటళ్లు, ఐస్ క్రీం పార్లర్లు అద్దె చెల్లించలేక పోర్షన్ ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. ఈ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
టూలెట్ బోర్డులు..
కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి యజమానుల సమస్యలు వర్ణనాతీతంగా మారాయి. లాక్డౌన్ దృష్ట్యా గత రెండు, మూడు నెలలుగా అద్దెలు చెల్లించకపోవడం సహా కొంతమంది ఇంటి అద్దెలు చెల్లించకుండా తాళాలు వేసి ఊర్లకు వెళ్లారు. మరికొన్ని ప్రాంతాల్లో యజమానులకు కిరాయిదారులు ఎంతో కొంత మూటజెప్పి ఇల్లు ఖాళీ చేసిన సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇవీ చూడండి: సౌర విద్యుత్ నగరంగా బెజవాడ..ఎంపిక చేసిన కేంద్రం