న్యాయమూర్తులపై ఆరోపణలతో.. శాసన, న్యాయ వ్యవస్థల మధ్య ఉన్న లక్ష్మణరేఖను ఏపీ సీఎం జగన్ దాటారని దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎస్ సోధి అభిప్రాయపడ్డారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తుల కూర్పుతో ఆయనకు పనేమిటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఘాటైన ఆరోపణలతో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంపై ఆర్‌ఎస్ సోధి తన అభిప్రాయాలను ‘ఈటీవీ భారత్’తో పంచుకున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ ముఖ్యమంత్రి ఇలా న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వాల చర్యలపై న్యాయసమీక్ష అధికారం కోర్టులకు ఉంటుందన్న విశ్రాంత న్యాయమూర్తి రెండు వ్యవస్థలూ పరస్పరం గౌరవ మర్యాదలు పాటించాలని సూచించారు. కోర్టుల నైతికస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నాలు వాటి పట్ల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు హైకోర్టుకు ప్రత్యేక ఉద్దేశాలేవీ ఉండవని సోధీ స్పష్టం చేశారు. ఆయన అభిప్రాయాలివీ..
న్యాయవ్యవస్థపై లేఖ దురదృష్టకరం
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు గుప్పిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం దురదృష్టకరం. కొన్ని రోజులుగా న్యాయవ్యవస్థపై ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. న్యాయవ్యవస్థపై ఎవరు ఆరోపణలు చేసినా మీడియా వాటికి ప్రాధాన్యమిస్తోంది. ఇలాంటి వాటిని న్యాయవ్యవస్థ ప్రతిఘటించాలి లేదా విస్మరించాలి.
ప్రతిఘటిస్తే ఎందుకు మీరు ప్రతివాదనలు చేస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. న్యాయవ్యవస్థ లక్ష్యంగా విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే కాపాడుకునేందుకు పోలీసు బలగాలు, సైన్యం లేని రాజ్యాంగ వ్యవస్థ.. న్యాయవ్యవస్థ ఒక్కటే. దీనిపై వచ్చే ఆరోపణలకు టీవీల్లో సమాధానం చెప్పేందుకు ప్రతినిధులు ఉండరు. న్యాయవ్యవస్థ తీర్పుల ద్వారా మాత్రమే సమాధానం ఇస్తుంది. ఎవరైనా తీర్పులను విమర్శించవచ్చు. అంతేకానీ న్యాయమూర్తులు వ్యక్తిగతంగా ఎవరికీ జవాబుదారీ కాదు. వారికి కేటాయించిన కేసులను పరిశీలించడం వరకే వారి పని.
చేసిన ప్రమాణాలను సీఎం ఉల్లంఘిస్తున్నారా?
సీఎంకు తన అధికారాలు, విధులు, పరిమితులపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆయన పరిపాలనా యంత్రాంగంలో ఒక భాగం మాత్రమే. చట్టప్రకారం రాష్ట్రాన్ని ఆయన పాలించాలి. ప్రభుత్వ ప్రతి చర్య.. అది మంచిదైనా, అద్భుతమైనదైనా కోర్టుల్లో ప్రశ్నించడానికి అర్హమైనదే. ఎవరైనా ప్రభుత్వ చర్యపై ఫిర్యాదు చేస్తే రాజ్యాంగ నిబంధనలు, చట్టప్రకారం అది సరైనదో కాదో నిర్ణయించాల్సిన బాధ్యత కోర్టులది. వ్యాఖ్యానం చేయడం కోర్టుల పని. ప్రభుత్వ ప్రతి చర్య న్యాయపరిశీలనకు లోబడే ఉంటుంది. ఒక సీఎంకు ఆ మాత్రం అవగాహన లేకుంటే ఎలా? ఇలాంటి విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఆయన ఎవరి సలహాలు తీసుకోలేదా? విజ్ఞుల సలహా అయినా తీసుకుని ఉండాల్సింది. ముఖ్యమంత్రికి చట్టబద్ధంగా నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలు ఉంటాయి. చట్టాన్ని మీరితే కోర్టులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగం, చట్టాన్ని రక్షిస్తానని ప్రమాణం చేసిన ఆయన దానిని తానే ఉల్లంఘిస్తున్నారా?
సీఎం చర్యలను పరిశీలించే అధికారం కోర్టులకు ఉంది
ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా, న్యాయమూర్తి ఎవరైనా, కోర్టులు, హైకోర్టుల్లో ఎలాంటి కూర్పు ఉన్నా ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం లేదు. సీఎం తన పదవీకాలం ఐదేళ్లలో తాను చేయదలచుకున్న పనులేవో చేస్తారు. అవి రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అని పరిశీలించే అధికారం కోర్టులకు ఉంది. దాన్ని ఆయన గౌరవించాలి. మరో ప్రత్యామ్నాయం లేదు.
విచారణలో మీకూ అవకాశం ఉంటుందిగా..
ప్రతి నేరస్థుడూ కోర్టు నెమ్మదిగా పని చేయాలనుకుంటాడు. ప్రతి బాధితుడూ వేగంగా న్యాయం జరగాలనుకుంటాడు. ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణ దిశలో సుప్రీం అడుగులు వేస్తోంది. అందర్నీ శిక్షించాలని సుప్రీం చెప్పలేదు కదా. ఎలా చేయాలో కూడా నిర్దేశించలేదు. విచారణలో అందరికీ సమానంగానే తమ వాదనలు తెలిపే అవకాశం ఉంటుంది.
ప్రజల నైతికస్థైర్యానికే విఘాతం
ఇది న్యాయవ్యవస్థ నైతిక స్థైర్యానికి సంబంధించినది కాదు. దేశ ప్రజల నైతిక స్థైర్యానికి చెందినది. న్యాయ పాలనకు, సమస్యలపై ఆశ్రయించేందుకు ఓ వ్యవస్థ ఉంది. కార్యనిర్వాహక, శాసనవ్యవస్థ పొరపాట్లు చేస్తే న్యాయ సమీక్ష జరుగుతుంది. హక్కుల పరిరక్షణ కోసం కోర్టులు పని చేస్తాయి. అందువల్ల ఇలాంటి ఘటనలతో కోర్టుల కంటే ఎక్కువగా దేశ ప్రజల నైతిక స్థైర్యమే దెబ్బతింటుంది. కాలం గడుస్తున్న కొద్దీ ప్రతి న్యాయమూర్తీ కొంత సున్నితత్వాన్ని కోల్పోవాల్సి వస్తోంది. అసందర్భమైన, అనవసరమైన అంశాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. వాస్తవాలు, చట్టం అనే అంశాల పరిధిలోనే వారు పని చేస్తారు. ఆ క్రమంలో తీర్పు తర్వాత తీర్పులు వస్తాయి. ఒక్క సీఎం న్యాయ వ్యవస్థకు తాను అతీతుడినని భావించినంత మాత్రాన కోర్టులు వెనకడుగు వేయవు. కోర్టులపై ఆరోపణలతో రాద్ధాంతం చేస్తూ ఎవరి నైతిక స్థైర్యాన్నో దెబ్బతీయడం సరికాదు.
న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం తొలిసారి
పదవిలో ఉన్న సీఎం న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకున్న ఉదంతాలు గతంలో ఎప్పుడూ లేవు. అవివేకంతో చేసే ఇలాంటి పనులు రోజూ జరగవు కదా. దేశంలో మునుపెన్నడూ జరగనివి ఇపుడు చాలా చోటుచేసుకుంటున్నాయి. న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం, ఆకర్షణీయమైన హెడ్‌లైన్లతో నిలవడం ఫ్యాషన్ అయిపోయింది.
అది నిర్ణయించాల్సింది కోర్టే
ఈ విషయంలో సీఎంపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలా లేదా అని నిర్ణయించాల్సింది కోర్టే. ఎందుకంటే కోర్టే ఇందుకు తగిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేస్తున్నారని కోర్టు భావిస్తే అలాంటి కేసులను తీసుకుంటుంది.
ఇదీ చదవండి: