తెలంగాణలో అణచివేత ధోరణికి చరమగీతం పాడాలని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో గెలిచేది భాజపాయేనని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలో జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అక్కడ ప్రజలను ప్రలోభాలకు గురిచేయడానికి కేసీఆర్ ఆలోచిస్తుంటారని ఈటల ఆరోపించారు. హుజూరాబాద్‌లో తనను ఓడించేందుకు నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
గెలిచేది భాజపానే..
ఈ నియోజకవర్గంలో ప్రజలంతా రాజకీయ విజ్ఞత కలిగిన వారు. జరిగిన పరిణామాలు, కేసీఆర్ నాయకత్వంలో ఏకపక్ష నిర్ణయాలు, అణచివేత ధోరణులు అందరికి అర్థమైంది. ఇలాంటి అణచివేతకు, దుర్మార్గాలకు, నియంతృత్వ పద్ధతులకు చరమగీతం పాడాలని హుజూరాబాద్ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచే జెండా కాషాయ జెండా.. గెలిచే గుర్తు కమలం గుర్తు. -ఈటల రాజేందర్, మాజీ మంత్రి, భాజపా నేత
ఈటలకు భాజపా అండగా ఉంది: జితేందర్ రెడ్డి
ఈటల రాజేందర్‌కు భారతీయ జనతా పార్టీ అండగా ఉందని భాజపా నేత జితేందర్ రెడ్డి అన్నారు. ఈటల లేకపోతే ఆనాడు తెలంగాణ ఉద్యమమే లేదని ఆయన పేర్కొన్నారు. తెరాస కోసం ఆయన ఎంతో కష్టపడినా... పార్టీ నాయకత్వం ఆయనకు తీరని అన్యాయం చేసిందన్నారు. ప్రజలంతా ఈటల రాజేందర్‌కు అండగా ఉన్నారని జితేందర్ రెడ్డి వెల్లడించారు.
ప్రజలే నిర్ణయించుకోవాలి: రఘునందన్‌రావు
ప్రజలకు ఎలాంటి పాలన కావాలో వారే నిర్ణయించుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. ప్రజాస్వామ్య పాలన కావాలో లేక గడీల పాలన కావాలో వారే తేల్చుకోవాలని సూచించారు. హుజూరాబాద్ ప్రజలు భాజపాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రజలకు సూచించారు.