Etela Rajendar on Munugode bypoll: తెలంగాణ మునుగోడు ఎన్నికల్లో భారాస పార్టీ భారీగా డబ్బులు ఖర్చు పెడుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్.. 45 సంవత్సరాల భాజపా పార్టీలకు సొంత విమానం లేదు కానీ.. కేసీఆర్ మాత్రం రూ.270 కోట్లు ఖర్చు చేసి విమానాన్ని కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఇన్ని డబ్బులు కేసీఆర్‌కు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ నెల 9న కేంద్రమంత్రి భూపేందర్ జాదవ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్‌చుగ్ రాష్ట్రానికి రానున్నట్లు ఈటల తెలిపారు. ఆ రోజు నర్సాపురం మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్‌తో పాటు నర్సాపూర్, జైరాబాద్, గజ్వేల్, పటాన్చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గాల నుంచి భారీగా చేరికలు ఉంటాయని వివరించారు. జిల్లాలో మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యేలు, సర్పంచులను ఇతర నాయకులను భాజపాలో చేరకుండా భయపెడుతున్నట్లు ఆయన ఆరోపించారు.
గ్రామంలో 10 నుంచి 15 బెల్టు షాపులు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది: కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇచ్చింది తక్కువ.. మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటూ తాగుడు రాష్ట్రంగా కేసీఆర్ తయారు చేశారని ఆయన ఆరోపించారు. గ్రామంలో 100 మంది జనాభా ఉంటే.. 10 నుంచి 15 వరకు బెల్టు షాపులను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. యువకులు తాగుడుకు బానిసై.. ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారని.. ఆడపడుచులకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మునుగోడులో తెరాస పంచే డబ్బులను మేము అడ్డుకోము: ఇప్పటికే మునుగోడుకు పలు రకాలుగా డబ్బులను పంపిణీ చేయడానికి తెరాస నేతలు సిద్ధంగా ఉంచుకున్నారని ఈటల ఆరోపించారు. వాటిని తాము అడ్డుకోమని.. అక్రమంగా సంపాదించిన డబ్బును ప్రజలకు పంచాలని కోరుకుంటున్నామన్నారు. దళిత బంధు, గిరిజన బంధు, పేదల బంధు.. గొల్ల కురుమలకు గొర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెరాసకి రూ.870 కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి..?: రాష్ట్రంలో భూమి ధర మార్కెట్లో రూ.3 కోట్లు పలుకుతుంటే.. దళితులు, పేదల భూములను రూ.10 లక్షలకే కేసీఆర్ బంధు వర్గానికి ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారని ఈటల ఆరోపించారు. దేశంలో ఏ పార్టీకి లేని నిధులు తెరాస పార్టీకి రూ.870 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది భాజపా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: