ఒకవైపు కరోనా ఉరుముతుంటే.. మరోవైపు నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. లాక్‌డౌన్‌లోనే కాదు.. అన్‌లాక్ మొదలైన తర్వాత జులైలోనూ వంట నూనెల మంటలు మండాయి. ఏడాదిలో ఒక్కో లీటరుపై ఏకంగా రూ.10-30 వరకు పెరిగాయి. చింతపండు 48% పెరిగింది. పెసర, మినపపప్పుల ధరలూ పెరిగాయి. ఆగస్టులోనూ ఇంచుమించు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కరోనాతో ఉపాధి కోల్పోయి ఆదాయం లేక అల్లాడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది మోయలేని భారంగా మారింది.
- బంగాళాదుంప, టమాటా
బంగాళదుంప, టమాటా ధరలు పెరిగాయి. లాక్‌డౌన్‌లో కొనేవారు లేక రైతులు టమాటాను పొలాల్లోనే వదిలేసిన దుస్థితి. ఫలితంగా మార్చిలో కిలో టమాటా రూ.16 చొప్పున లభించగా.. జులైనాటికి రూ.48 వరకు చేరింది. బంగాళదుంప ధరలూ మార్చితో పోలిస్తే జులైనాటికి కిలోకు రూ.6, ఆగస్టులో రూ.10వరకు పెరిగాయి. ఉల్లి మాత్రం కాస్త కరుణించింది. గతేడాది జులై కంటే రూ.5 వరకు తగ్గగా.. ఆగస్టులో మళ్లీ పెరిగింది. లాక్‌డౌన్‌తో హోటళ్లు, రోడ్డు పక్క బళ్లు లేకపోవడంతో పెసర, మినపపప్పుల వినియోగం తగ్గినా ధరలు మాత్రం పెరిగాయి.
* పెసరపప్పు మార్చిలో కిలో రూ.108ఉండగా.. జూన్‌లో రూ.119వరకు చేరింది. జులై, ఆగస్టుల్లో కిలోకు రూ.4-6వరకు దిగొచ్చింది
* మినపపప్పు మార్చిలో కిలోకు రూ.109 ఉండగా, జూన్‌నాటికి రూ.110 అయింది. జులైలో కిలోకు రూ.2వరకు తగ్గింది. గతేడాదితో చూస్తే కిలోకు రూ.27 వరకు పెరిగింది.
* లాక్‌డౌన్ ఆరంభంలో బియ్యం ధరలు నిలకడగానే ఉన్నా.. ఏప్రిల్, మే, జూన్, జులైలో నాణ్యమైన రకాలపై కిలోకు రూ.1 మేర పెరిగాయి.
* మార్చిలో రూ.90 ఉన్న కిలో కందిపప్పు జూన్‌లో రూ.96వరకు చేరి జులైనాటికి రూ.94 అయింది.
* కిలో పంచదార మార్చిలో రూ.39 ఉంటే జులైనాటికి రూ.41వరకు చేరింది. బెల్లంపైనా కిలోకు రూ.5 వరకు పెరిగాయి.
* మార్చిలో కిలో రూ.168 చొప్పున ఉన్న.. విత్తనం లేని చింతపండు జులైనాటికి రూ.195 వరకు చేరింది. గతేడాది జులై కంటే కిలోకు రూ.63 వరకు పెరిగింది.
- 25% పెరిగిన వేరుసెనగనూనె
మార్చిలో లీటరు వేరుసెనగ నూనె రూ.128 చొప్పున లభించగా జులైనాటికి రూ.144 అయింది. 2019 జులైలో దీని ధర లీటరుకు రూ.115 మాత్రమే. గతేడాది జులైనాటి ధరల కంటే పామోలిన్‌పై లీటరుకు రూ.17, పొద్దుతిరుగుడు నూనెపై రూ.14 చొప్పున పెరిగాయి. వనస్పతిపైనా రూ.11 వరకు ఎగసింది.
ఇదీ చదవండి: కరోనాతో.. లెక్కల మాస్టారు జీవన ప్రయాణం లెక్క తప్పింది..!