గుంటూరు బ్రాడీపేటలో భాజపా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రధాని మోదీ పేరున ఈ కిట్లను మాజీ మంత్రి శనక్కాయల అరుణ, మాజీ మేయర్ కన్నా నాగరాజు ప్రజలకు అందించారు.
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సింగవరం కూడలిలో దాతలు సాగిరాజు సాయి కృష్ణంరాజు, పి.బోస్ రాజులు 1000 మందికి అన్నదానం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వలస కూలీలు, వాహనచోదకులకు వీటిని అందజేశారు. తణుకు నియోజకవర్గంలోని పేద బ్రాహ్మణ కుటుంబాల పట్ల అమెరికాలోని ప్రవాసాంధ్ర తెదేపా అభిమానులు బాసటగా నిలిచారు. 150 పేద బ్రాహ్మణ కుటుంబాలకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు.
కడప జిల్లా మైదుకూరు మండలంలోని వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే రఘురాం రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. స్థానికంగా ఉన్న ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా దాదాపు రోజుకు 250 మందికి అన్నదానం చేస్తున్నారు కడపకు చెందిన ఇమ్రాన్ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుని స్నేహితులు. రోజుకు రూ.9 వేలు వెచ్చించి నిరుపేదలకు భోజనం అందిస్తున్నారు.
కరోనా వైరస్ కట్టడికి కృషిచేస్తున్న వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీస్ సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లను భాజపా జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అందించారు. కరోనా నియంత్రణకు శ్రమిస్తున్న వారికి తోడుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.