ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు జగన్ సర్కారు జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు చదువులు తలపెడుతూ గత నవంబర్లో ప్రభుత్వం 81, 85 జీవోలు జారీ చేసింది. వాటిని సవాలు చేస్తూ అసి స్టెంట్ ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్, భాజపా నేత సుధీష్ రాంబొట్ల హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం 92 పేజీల తీర్పు వెలువరించింది.Spot
ఉల్లంఘించడమే..
రాజ్యాంగంలోని అధికరణ 19(1) భావ వ్యక్తీకరణ, వాక్ స్వాతంత్ర్యం కల్పిస్తోంది. విద్యాభ్యాసం అందులోనే అంతర్గతంగా ఉంది. మాతృభాషలో అయినా లేదా గుర్తించిన భాషల్లో మాధ్యమం ఎంపిక చేసుకునే హక్కు అధికరణ 19 (1) (ఎ) కల్పిస్తోంది. ప్రభుత్వం జీవో జారీ చేయడం ద్వారా అన్ని పాఠశాలల యాజమాన్యాలు మాధ్యమాన్ని ఆంగ్లంలోకి మార్చాలని చెప్పడం... అధికరణ 19 (1) (జీ) ని ఉల్లంఘించడమేనని హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి మార్చే అధికారం లేదు
పాఠ్యాంశాలు, మాధ్యమం నిర్ణయించే అధికారం విద్యా హక్కు చట్టం ప్రకారం ఏపీ విద్యా చట్టం-1982 ప్రకారం ఎస్సీఈఆర్టీకి ఉంటుంది. మాధ్యమాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పిల్లల్ని ఏ మాధ్యమంలో చదివించుకోవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది. పేరెంట్స్ అసోసియేషన్ల ఆకాంక్ష మేరకు మాధ్యమాన్ని మార్చేందుకు వీల్లేదు. ఆ విధంగా మార్చొచ్చని చట్టాలు, నిబంధనలు లేవు. ఒక్కసారిగా అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఆంగ్ల మాధ్యమంలోకి మారాలనడం వారి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమే అవుతుందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఏపీ విద్యా హక్కు చట్టానికి సవరణ చేసిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయక ముందే జీవో ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించిన హైకోర్టు..ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేసింది.
రాజ్యాంగ విరుద్ధం...
విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 29 (2) (F) ప్రకారం ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలన్న నిబంధనలకు.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలు విరుద్ధంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. మాధ్యమాన్ని మార్చేందుకు నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం అకడమిక్ అథార్టీతో సంప్రదింపులు జరిపినట్లు కనిపించడం లేదని కోర్టుకు తెలిపారు. అకడమిక్ అథార్టీ సిఫారసులు లేకుండా హఠాత్తుగా మాధ్యమంలో మార్పు చేయడం విద్యా హక్కు చట్టం సెక్షన్ 29 (2) (F) ని ఉల్లంఘించడమేనని చెప్పారు. ప్రాథమిక విద్య దశలో మాధ్యమాన్ని ఎంపిక చేసుకునే హక్కు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని... మాతృభాష కన్నా ఆంగ్లం మరింత ప్రయోజనం అనే రాష్ట్ర ప్రభుత్వ వాదన సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీవో ద్వారా ఒక్క కలం పోటుతో మాధ్యమం ఎంచుకొనే హక్కు తీసేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
ఏపీలో మాతృభాషగా తెలుగు అభివృద్ధి చెందడానికి సొంత చరిత్ర ఉంది. తెలుగు పాఠశాలల్ని ఆంగ్ల మాధ్యమానికి మార్చేందుకు ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వం అనాలోచితంగా జీవోలు జారీ చేసిందని కోర్టు అభిప్రాయపడింది. స్వాతంత్ర్యానికి పూర్వం, తర్వాత, 1955 రాష్ట్ర పునర్విభజన కమిషన్, జాతీయ విద్యా విధానం లాంటి నివేదికలన్నీ పరిశీలించాక 1నుంచి 8 వరకు మాతృభాషలో విద్యా బోధన ఉండాలని స్పష్టం చేస్తున్నాం. రాజ్యాంగం, విద్యా హక్కు, సుప్రీం తీర్పుల స్ఫూర్తికి విరుద్ధంగా జీవోలున్నందున వాటిని రద్దు చేస్తున్నాం అని హైకోర్టు పేర్కొంది. బ్రిటిష్ కాలం నుంచి చారిత్రక అంశాల్ని సైతం న్యాయస్థానం తీర్పులో స్పృశించింది. మహాత్మా గాంధీ, బాల గంగాధర తిలక్, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణ, గోపాలకృష్ణ గోఖలే మాతృభాషకు ఇచ్చిన ప్రాధాన్యం, వారి అభిప్రాయాల్ని ప్రస్తావించింది. మాతృభాషలో భావ వ్యక్తీకరణను పిల్లలు సులభంగా స్వీకరించగలరని పేర్కొంది. ఇతర భాషలో విద్యా బోధన మానసిక వికాసంపై ప్రభావం చూపుతుందంటూ, జ్ఞాన మార్పిడికి మాతృభాషే ఉత్తమమని ప్రముఖులు చెప్పిన విషయాల్ని తీర్పులో పేర్కొంది .
ఇదీ చదవండి : 'ప్రజాప్రతినిధులు ఇంట్లో ఉండటం సమంజసం కాదు'