employee protest on prc: ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని విశాఖలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పీఆర్సీ అమలు సహా 71 డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
సానుకూల స్పందన లేక ఉద్యమానికి పిలుపునిచ్చామని కర్నూలులో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని.. ఇప్పటికీ వచ్చేనెల 6 వరకు సమయమిచ్చామని పేర్కొన్నారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగజేయవద్దనే సంయమనం పాటిస్తున్నామన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలనే అడుగుతున్నామని.. ప్రభుత్వం మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. మొక్కుబడి సమావేశాలతో ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
పీఆర్సీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. కనీసం పీఆర్సీ నివేదిక ఎందుకు బయటపెట్టలేదు. నివేదిక ఇవ్వనివాళ్లు... పీఆర్సీ ప్రకటిస్తారని అనుకోవాలా. కోరుకుని తెచ్చుకున్న ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి అర్థంకాని పరిస్థితి నెలకొంది.- ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఇదీ చదవండి: