Amaravati Farmers Maha Padayatra: అమరావతికి జనహారతి అంటూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బందర్లో రైతుల పాదయాత్ర బ్రహ్మాండంగా సాగింది. 11వ రోజు చిన్నాపురం నుంచి ప్రారంభమైన యాత్ర.. గుండుపాలెం, రుద్రవరంల మీదుగా, మచిలీపట్నం వరకు సాగింది. శాసనసభలో సీఆర్డీఏ చట్టానికి సవరణలు చేయడంపై రాజధాని రైతులు మండిపడ్డారు. ప్రజాభిప్రాయం లేకుండానే మాస్టర్ ప్లాన్ మార్పు చేసేందుకు చట్టసవరణ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసి ఎలాంటి చర్చా లేకుండా కీలకమైన బిల్లుల్ని చివరి నిమిషంలో పెట్టడాన్ని రైతులు తప్పుపట్టారు. సీఆర్డీఏ చట్టానికి ప్రభుత్వం చేసిన సవరణలు హైకోర్టు తీర్పునకు విరుద్ధమని రైతులు మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు రాజధానిని అభివృద్ధి చేసి ఎన్ని చట్ట సవరణలనైనా చేసుకోవాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ మార్పు చేసేందుకు చట్టసవరణ చేయటంపై ఆగ్రహంవ్యక్తం చేస్తూ.. బిల్లు ప్రతులను తగులబెట్టారు. ఈ వ్యవహారంపై మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
అమరావతి మహాపాదయాత్రకు మచిలీపట్నంలో స్థానికుల నుంచి పెద్దఎత్తున మద్దతు కొనసాగుతోంది. మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. రైతులతో కలిసి తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు, భాజపా నేతలు కొంత దూరం నడిచారు. జై అమరావతి నినాదాలతో మచిలీపట్నం మార్మోగింది. ముస్లిం మహిళలు అమరావతి రథం వద్దకు వచ్చి.. ప్రార్థనలతో సంఘీభావం తెలిపారు. షాదీఖానాలోనే రైతులకు భోజన వసతి కల్పించి తమ ఆత్మీయత చాటుకున్నారు.
మచిలీపట్నంలో బొబ్బలెక్కిన రైతుల పాదాలకు మందు రాసి అమరావతిపై న్యాయవాదులు ఆకాంక్షను చాటారు. 11 వ రోజు 17 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర మచిలీపట్నంలో కోనేరు సెంటర్ మీదుగా హూస్సేన్పాలెం హర్ష కళాశాల వరకు సాగింది.
ఇవీ చదవండి: