నగరపాలక, పురపాలక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేసిన వారిలో గుర్తింపు పొందిన లేదా రిజిస్టర్డ్ పార్టీలకు చెందిన అభ్యర్థులెవరైనా మరణిస్తే ఆ డివిజన్‌లో ఎన్నిక వాయిదా పడుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. నామినేషన్ల ఉపసంహరణతోపాటు అభ్యర్థులు మరణిస్తే అనుసరించాల్సిన విధివిధానాల్ని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వివరించింది.
ఏ సందర్భాల్లో ఎన్నిక వాయిదా వేస్తారు?
* గుర్తింపు పొందిన లేదా రిజిస్టర్డ్ పార్టీ తరపున నామినేషన్ వేసిన అభ్యర్థి.. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజున ఉదయం 10 గంటల తర్వాత మరణిస్తే, ఆ అభ్యర్థి నామినేషన్ పత్రాలు నిబంధనల ప్రకారమే ఉన్నాయని పరిశీలనలో తేలితే..
* నామినేషన్ల గడువు ముగిశాక.. ఒక అభ్యర్థి నామినేషన్ సరిగానే ఉందని పరిశీలనలో తేలాక, నామినేషన్ ఉపసంహరించుకోకుండా చనిపోతే..
* నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థి పోలింగ్ మొదలవడానికి ముందు చనిపోతే వాయిదా వేస్తారు. అభ్యర్థి చనిపోయిన విషయాన్ని రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించుకోవాలి. అక్కడ పోలింగ్ తేదీని మళ్లీ నోటిఫై చేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.
నామినేషన్ల ఉపసంహరణ
* ఎస్‌ఈసీ నిర్దేశించిన గడువులోగా లిఖితపూర్వక నోటీసిచ్చి నామినేషన్ ఉపంసహరించుకోవచ్చు. అభ్యర్థి స్వయంగా వెళ్లి నోటీసు అందజేయవచ్చు. లేదా తన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన వ్యక్తితోగానీ, ఎన్నికల ఏజెంట్‌తో గానీ పంపించవచ్చు.
* నామినేషన్ ఉపసంహరణకు ఒకసారి నోటీసిచ్చిన తర్వాత వెనక్కు తీనుకునేందుకు వీలుండదు.
* నామినేషన్ల ఉపంసహరణ ప్రక్రియ పూర్తయ్యాక రిటర్నింగ్ ఆధికారి ఆ వివరాల్ని నోటీసు బోర్డులో ఉంచాలి.
నామినేషన్లు వేసిన వారిలో 30 మంది మృతి
పురపాలక ఎన్నికల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో 30 మంది గతేడాది కాల వ్యవధిలో మరణించారు. కొవిడ్, ప్రమాదాలు, అనారోగ్యంతో వీరు చనిపోగా, ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో నామినేషన్లు వేసిన వారిలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 8 మంది, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో నలుగురేసి అభ్యర్థులు మరణించారు. వీరిలో ప్రధాన పార్టీలతో పాటు ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు.
ఇదీ చదవండి: 'ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి'