EAPCET: ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో వెబ్ ఐచ్ఛికాల నమోదుకు మంగళవారం రాత్రి వరకు విద్యార్థులు నిరీక్షించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులు, కళాశాలల ఎంపికకు మంగళవారం నుంచి వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవచ్చని సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థులు ఉదయం నుంచి ప్రయత్నించినా సాఫ్ట్‌వేర్ పని చేయలేదు. సాంకేతిక సమస్యపై అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని విద్యార్థులు తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో జేఎన్‌టీయూ, కాకినాడ తీవ్ర జాప్యం చేసింది. అనుబంధ గుర్తింపు ఫీజుల బకాయిలు చెల్లిస్తేనే అనుమతులు ఇస్తామని ప్రకటించింది. బకాయిల్లో కనీసం 25శాతం చెల్లించాలనే నిబంధన విధించింది. కొన్ని యాజమాన్యాలు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. కొంత సమయం ఇస్తూ 25శాతం బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. అలా ముందుకొచ్చిన కళాశాలలకు చివరి క్షణంలో వర్సిటీ అనుమతులు ఇచ్చింది. వీటిని కౌన్సెలింగ్‌లో పెట్టేందుకు ఉన్నత విద్యాశాఖ అనుమతికి పంపగా.. సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఉదయం లోపు కళాశాలల వివరాలను కౌన్సెలింగ్ జాబితాలో నమోదు చేయలేక అధికారులు వెబ్ ఐచ్ఛికాలను నిలిపివేశారు. ఈ విషయంపై వెబ్‌సైట్‌లో ఎలాంటి నోట్ పెట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో మొదటి నుంచి జాప్యం జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం వెబ్ ఐచ్ఛికాల నమోదుకు 17వరకు గడువు ఇచ్చారు.
ఇవీ చదవండి: