విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలోని కనకదుర్గమ్మ వెండి రథంపై ఉండే సింహాల్లో మూడు అదృశ్యమైన వ్యవహారంలో ఎట్టకేలకు ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నాగోతి రమేష్‌బాబు లిఖిత పూర్వకంగా విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందించారు. కేసు నమోదు చేయాలని కోరారు.
స్ట్రాంగ్ రూమ్ ల్లోనూ లేవు...
ఏడాదిగా తాను ప్రధాన ఆలయంతో పాటు స్టోర్స్‌కు ఇన్‌ఛార్జిగా పని చేస్తున్నానని... 2020 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఉత్సవ విభాగానికి ఇన్‌ఛార్జిగా ఉన్నానని సహాయ కార్యనిర్వహణాధికారి నాగోతి రమేష్‌బాబు తెలిపారు. అంతర్వేది ఘటన తర్వాత ఈనెల 14వ తేదీన దేవాదాయశాఖ కమిషనర్, విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు రథాన్ని పరిశీలించామన్నారు. సింహాల ప్రతిమలు లేకపోవడంపై.. గోల్డ్ అప్రైజర్ డి. షమ్మికి ఫోన్ లో తెలియజేశానని వివరించారు. ఈవో అనుమతితో స్ట్రాంగ్ రూమ్ ను తనిఖీ చేశామని... అందులోనూ ప్రతిమలు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రథం ధర ఎంతంటే...?
దేవస్థానం నిర్వహించే ఇన్వెంటరీ రిజిస్టరు ప్రకారం వెండి రథం 2002 ఏప్రిల్ 15వ తేదీన దేవస్థానం తయారు చేయించినట్లు నమోదు అయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్వెంటరీ రిజిస్టరు ప్రకారం నాలుగు సింహాలకు గాను వెండి బరువు 13 కేజీల 460 గ్రాములుగా ఉందని... ఒక్కో సింహం విగ్రహం బరువు సుమారు మూడు కేజీల 365 గ్రాములుగా రికార్డుల్లో ఉందని వివరించారు. 1999 సంవత్సరంలో ఇంజనీరింగ్ విభాగం తయారు చేసిన అంచనాల ప్రకారం కేజీ ఎనిమిది వేల రూపాయల వంతున... మొత్తం 80 వేల 760 రూపాయలుగా విలువ ఉంటుందని తెలిపారు. 2019 ఏప్రిల్ ఆరో తేదీ నుంచి ఈనెల 15వ తేదీ మధ్య కాలంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వెండి రథానికి అమర్పిన నాలుగు సింహాలలో మూడింటిని అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు
వెండి సింహాల ప్రతిమల మాయంపై ఏఈవో ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: