భూముల రీ-సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో మార్పులు జరగబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంపిక చేసిన 51 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి కాబోతుంది. మరో 650 గ్రామాల్లో కొనసాగుతోంది. పెద్ద గ్రామాల్లో సర్వే మొదలుపెడితే ఎక్కువ సమయం పడుతుంది. నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం అధికారికంగా రీ-సర్వే గురించి రైతులకు తెలియజేయడం, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారానికి కనీసం 4 నెలలు పడుతుంది. సర్వేకు మరో 2 నెలల సమయం తప్పనిసరి. కానీ ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్రానికి డ్రోన్లు తగినంతగా రావట్లేదు. రీ-సర్వే చేయాల్సిన గ్రామాల సంఖ్య పెరిగేకొద్దీ వాటి అవసరం పెరుగుతుంది. ప్రస్తుత అవసరాల మేరకు కనీసం 40 డ్రోన్లు వెంటనే కావాలని అంచనా వేశారు. కానీ అవి రావడం అనుమానంగానే ఉంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకం కింద ఇల్లు, ఇళ్లస్థలాలు గుర్తించేందుకు డ్రోన్లను ఉత్తరాది రాష్ట్రాలకు సర్వే ఆఫ్ ఇండియా తరలిస్తోంది. అక్కడ త్వరలో ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర అవసరాలకు తగినన్ని డ్రోన్లు రావడం కష్టమే. ఈ పరిస్థితుల్లో ఒప్పందాన్ని రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసేలా ఒప్పందంలో మార్పులు, చేర్పులు చేసేందుకు వచ్చేవారం ఉన్నతస్థాయిలో సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి. రీ-సర్వే కోసం డ్రోన్ల సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా మధ్య రూ.96 కోట్లతో ఒప్పందం జరిగింది. సర్వే ఆఫ్ ఇండియాకు నిధుల చెల్లింపుల్లోనూ సమస్యలు నెలకొన్నాయి.
ఫిక్స్‌డ్ వింగ్ డ్రోన్ల ఉపయోగం?
సర్వే ఆఫ్ ఇండియా ఉపయోగించే డ్రోన్లు ప్రొటోటైప్‌కి చెందినవి. నాలుగు కాళ్లు ఉండి.. నిటారుగా పైకి లేచి, సాంకేతిక సిబ్బంది ఇచ్చే సూచనల ప్రకారం పనిచేస్తాయి. ఇప్పుడు ‘ఫిక్స్‌డ్ వింగ్ డ్రోన్ల’ను ఉపయోగించాలని భావిస్తున్నారు. వివాహ కార్యక్రమాల్లో ఫొటోలు, వీడియోలు తీసే విమానం మాదిరిగా ఇవి గాల్లో తిరుగుతాయి. అయితే.. నిర్ణీత స్థాయి కంటే ఎక్కువ గాలి వస్తే ఇవి తిరగలేవు. ప్రొటోటైప్ డ్రోన్లకు ఈ సమస్య తక్కువ. ఫిక్స్‌డ్ వింగ్ డ్రోన్లు సరఫరా చేసే సంస్థలతో ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తోంది. త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో దీనిపై చర్చించి టెండరు పిలవనున్నారు.
ఇదీ చూడండి:
వైకాపా దుర్మార్గాలను అడ్డుకునేందుకు.. ప్రజామద్దతు కావాలి : చంద్రబాబు