Founder of SRM University: రాజధాని అమరావతిలో రహదారుల పరిస్థితిపై ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు డాక్టర్ టీఆర్ పారివేందర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. శనివారం నాడు జరిగిన ఎస్ఆర్ఎం రెండవ స్నాతకోత్సవంలో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వ ఆహ్వానంతో ఇక్కడకు వచ్చామని చెప్పారు. తమకు ఇచ్చిన రెండు వందల ఎకరాల్లో.. అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాంపస్ నిర్మించామని తెలిపారు. మంచి భవనాలు, అత్యుత్తమ సిబ్బంది ఉన్నప్పటికీ యూనివర్శిటీకి వచ్చే రోడ్లు సరిగా లేకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు. తమ చేతుల్లో లేని వాటిపై ఏమీ చేయలేకపోతున్నామని వ్యాఖ్యానించారు.
"భవనాలు బాగున్నాయి... వసతులు మెరుగ్గా ఉన్నాయి.. మంచి అధ్యాపకులు ఉన్నారు.. విదేశాల్లో బోధించే టీచర్లు ఉన్నారు. అన్నీ బాగున్నాయి. కానీ, ఇక్కడకు వచ్చే రోడ్ల వల్ల మీరు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. కొన్నింటిని మనం పరిష్కరించలేం. మేం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. మంచి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. మంచి విద్యా భోదన, అధ్యాపకులు అందరూ ఉన్నారు. కానీ ఇక్కడి తరగతులకు మీరు రావాలంటే.. రోడ్లు బాగాలేవు. ఇందుకు నేను.. మీరు బాధ్యులం కాదు. మీకు ఇది సవాలు లాంటింది. దీన్ని సులువుగా పరిష్కరించలేం. సమస్యలన్నింటినీ భరించాల్సిందే. వాటిని అధిగమించాల్సిందే. చాలా మందికి హాస్టళ్లలో వసతి కల్పించాం. రాబోయే రోజుల్లో మరింత మందికి హాస్టల్ వసతి కల్పిస్తాం. రోడ్లు బాగాలేవు కనుక మీరు ఇంటి నుంచి రావాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేస్తాం."- డాక్టర్ టి.ఆర్.పారివేందర్
ఇవీ చదవండి: