దేశవ్యాప్తంగా 11 కోట్ల కుటుంబాలను కలిసి.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి విరాళాలు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త కార్యదర్శి ఎక్కల రాఘవేంద్రరావు తెలిపారు. సంక్రాంతి నుంచి విశ్వహిందూ పరిషత్ సేవకులు దేశంలో నాలుగు లక్షల గ్రామాల పర్యటన ప్రారంభించారని ఆయన అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 27 వరకు శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ యాత్ర జరుగుతుందని పేర్కొన్నారు.
మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనవంతు విరాళంగా నాలుగు కోట్ల రూపాయలు ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన కుమారుడు.. వీహెచ్‌పీ నేతలకు అందించారు. ఇప్పటికే ఆయన కోటి రూపాయలను చినజీయరుస్వామి సమక్షంలో కొద్దిరోజుల క్రితం అందజేశారని వీహెచ్‌పీ నేతలు తెలిపారు. రామమందిరం నిధి అభియాన్ పేరిట కమిటీలు ఏర్పరచుకొని, ప్రతి హిందూ కుటుంబం నుంచి విరాళాలు సేకరించే కార్యాన్ని తమ సేవకులు తలకెత్తుకున్నారని అన్నారు. రాష్ట్రంలో పది వేల గ్రామాల్లో పర్యటించాలనేది తమ లక్ష్యమని.. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో వారు ఇచ్చే ప్రతి పైసా మందిర నిర్మాణానికి వినియోగమవ్వాలన్నది ట్రస్టు లక్ష్యంగా నిర్ణయించుకుందని తెలిపారు.
గుంటూరులో..
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి హిందువులంతా సహకరించాలని ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి చేసింది. దుగ్గిరాలలో.. రామాలయ నిర్మాణానికి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ ప్రారంభమైంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి చేసిన పోరాటంలో దాదాపు 4 లక్షల మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారని.. గుంటూరు జిల్లా ఆర్ఎస్ఎస్ మీడియా ఇంఛార్జ్ అవ్వారు శ్రీనివాసరావు చెప్పారు. అలాంటి ప్రాణత్యాగం మనం చేయకపోయినా దేవాలయ నిర్మాణానికి ప్రతి హిందువు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అనంతపురంలో..
అయోధ్య రామమందిర నిర్మాణం కోసం నిధి సేకరణ కార్యక్రమం అనంతపురం జిల్లా హిందూపురంలో యోగి నారాయణ సేవ సమితి ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించారు పట్టణంలోని లక్ష్మీపురం దశరథరామయ్య కాలనీలలో వీధులలో యోగి నారాయణ సేవా సమితి సభ్యులు రామ సంకీర్తనలు పాడుకుంటూ భజన కార్యక్రమం ద్వారా విరాళాలు సేకరించారు. మొదటగా యోగి నారాయణ స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. అయోధ్య రామమందిర నిధి సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి మహిళకు శాస్త్రోక్తంగా పసుపు కుంకుమ గాజులు ఇచ్చి ముందుకు సాగారు. అయోధ్య రామమందిర నిర్మాణంలో ఉడుతాభక్తి సాయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు యోగి నారాయణ సేవా సమితి సభ్యులు తెలిపారు.