తెలంగాణలో మహిళలపై దాడులు రోజురోజుకు పెరగుతున్నాయి. ఆరేళ్లలో గృహహింస మూడురెట్లయింది. ‘డయల్-100’ ఫోన్‌కాల్స్ విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ వ్యవస్థకు రోజు వస్తున్న ఫోన్‌కాల్స్‌లో 12 శాతం మహిళలపై వేధింపులు, దాడులకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇవి రోజుకు సగటున 450 ఉంటున్నట్లు విశ్లేషించారు. వీటిలో 250 వరకు గృహహింసకు సంబంధించినవే కావడం గమనార్హం. ఇందులో 181 ఫోన్‌కాల్స్‌ను కౌన్సెలింగ్ కోసం బదిలీ చేస్తున్నారు. మహిళలపై దాడులకు సంబంధించి 2016లో 59,000 ఫోన్‌కాల్స్ రాగా.. 2020, నవంబరు నాటికి ఆ సంఖ్య 1,60,000కు చేరడం గమనార్హం. అదేవిధంగా ఉమన్ హెల్ప్‌లైన్(181)కు రోజుకు సగటున 800 కాల్స్ వస్తున్నాయి. వీటిలో 40-45 మాత్రమే అత్యవసరమైనవి. లాక్‌డౌన్ తరవాత ‘181’కు అత్యవసర కాల్స్ పెరిగినట్లు వెల్లడైంది. మూడేళ్లలో (2017,ఆగస్టు నుంచి 2020,నవంబరు వరకు) 13,565 గృహహింస కేసులు నమోదయ్యాయి.
‘డయల్ 100’ ఎలా పనిచేస్తుంది?
మహిళా భద్రత కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణులతో ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ గురువారం హైదరాబాద్ శివారు కొంపల్లిలోని జీవీకే-ఈఎంఆర్‌ఐ కేంద్రాన్ని సందర్శించింది. మహిళల అత్యవసర సహాయం కోసం ఏర్పాటుచేసిన డయల్-100, 181- ఉమెన్ హెల్ప్‌లైన్ వ్యవస్థల పనితీరు గురించి ఈ సందర్భంగా కమిటీలోని అధికారిణులు అడిగి తెలుసుకున్నారు. ఆపదలో ఉన్న మహిళలు ఫోన్ చేసిన వెంటనే ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంటున్నారో ఆరా తీశారు. ‘దిశ’ ఉదంతం అనంతరం మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన పటిష్ఠ చర్యల గురించి ప్రభుత్వం ఈ అత్యున్నత కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. కమిటీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితాసబర్వాల్‌తోపాటు ఐఏఎస్‌లు క్రిస్టినా జడ్ చాంగ్తూ, యోగితారాణా, కరుణ, ప్రియాంకవర్గీస్, దివ్య, శ్వేత మహంతి, మహిళా భద్రత విభాగం డీఐజీ సుమతి ఉన్నారు.
ఇదీ చూడండి: స్నేహితులతో తన బాధను పంచుకున్న ప్రియాంక..