ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏం చేయాలి? లక్షణాలు మొదలైన మొదటిరోజు నుంచి అవి తగ్గేవరకు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్యుల్ని ఎప్పుడు సంప్రదించాలి? ఆసుపత్రిలో ఎప్పుడు చేరాలి? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఏం తినాలి? చాలా మందిని వేధిస్తున్న ప్రశ్నలివి. ఇక కుటుంబంలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఇంటిల్లిపాదికీ ఆందోళన మొదలవుతోంది. ఏ డాక్టర్‌ను సంప్రదించాలో, ఏ మందులు వేసుకోవాలో తెలియక తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. ఈ ప్రశ్నలకు ఏలూరు ఆశ్రమ్ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ అందిస్తున్న సవివర సమాచారం ఇది.
ఏ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1 వ రోజు..
ప్రస్తుతం కరోనా వైరస్ ఇంట్లో ఒకరికి సోకితే.. ఇంట్లోని మిగతావారికీ వేగంగా సంక్రమిస్తోంది. కాబట్టి ఒంటి నొప్పులు, జలుబు, గొంతునొప్పి, జ్వరం, నీరసం వంటి లక్షణాలేవి కనిపించినా అది కరోనాగానే భావించి సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లాలి. జలుబు, జ్వరం వంటి లక్షణాలుంటే వాటి నివారణకు సిట్రజెన్, పారాసెటమాల్ వంటి మందులు వేసుకోవచ్చు. వీలైతే లక్షణాలు కనిపించిన మొదటిరోజే కుటుంబ వైద్యుణ్నిగానీ, ఎవరైనా ఫిజీషియన్‌నుగానీ సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది. జలుబు ఉంటే ఆవిరి పట్టుకోవాలి.
2 వ రోజు..
ఐసొలేషన్‌లోనే ఉంటూ వ్యాధి లక్షణాలు తగ్గడానికి డాక్టర్ సూచించిన మందులు వాడాలి. కొత్త లక్షణాలేమైనా వస్తే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటికి మందులేమైనా సూచిస్తే వాడటం ప్రారంభించాలి. ఆవిరి పట్టడం కొనసాగించాలి.
3 వ రోజు..
వ్యాధి లక్షణాలు కొనసాగుతుంటే కరోనానా? కాదా? నిర్ధారించుకొనేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. సాధారణంగా లక్షణాలు మొదలైన మూడో రోజు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తే కరోనా సోకిందీ లేనిదీ స్పష్టంగా తెలిసే అవకాశముంటుంది. వాడుతున్న మందులు కొనసాగించాలి.
4 వ రోజు..
ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్ వచ్చినా వ్యాధి లక్షణాలకు మందులు కొనసాగిస్తూ ఐసొలేషన్‌లోనే ఉండాలి. పాజిటివ్ వస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. వారి సూచన మేరకు శరీరంలో వైరస్ పెరగకుండా నిరోధించేందుకు అవసరమైన యాంటీ వైరల్ మందులు వాడటం ప్రారంభించాలి. పల్స్‌ఆక్సీమీటర్ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి. కూర్చుని ఒకసారి, వారు ఉంటున్న గదిలోనే ఆరు నిమిషాలు నడిచాక మరోసారి రక్తంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉందో పరీక్షించుకోవాలి. ఇలా రోజుకు నాలుగుసార్లు చేయాలి. ఆక్సిజన్ 95 శాతం కంటే తగ్గితే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.
5 వ రోజు..
జ్వరం తగ్గకపోవడం, జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతోపాటు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కూడా మొదలైతే తక్షణం వైద్యులను సంప్రదించి సీటీస్కాన్, రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిది. వైద్యుల సలహా మేరకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, సీరం ఫెర్రిటిన్, సి రియాక్టివ్ ప్రొటీన్, డి-డైమర్, ఎల్‌డీహెచ్ వంటి రక్తపరీక్షల్ని చేయించుకోవాలి. అయిదు రోజులైనా తీవ్రమైన వ్యాధి లక్షణాలు కొనసాగుతున్న పెద్ద వయస్కులు, రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో లేనివారు ఆసుపత్రిలో చేరడం మంచిది.
6 వ రోజు..
సీటీస్కాన్‌లో ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్టు బయటపడితే.. వైద్యుల సలహా మేరకు ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవడమో, ఆసుపత్రిలో చేరడమో నిర్ణయించుకోవాలి. ఇంట్లో ఉన్నా, ఆసుపత్రిలో చేరినా వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. మందులు కొనసాగించాలి.
7 వ రోజు..
ఆసుపత్రిలో చేరినవారు ఎలాగూ వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఉంటారు. ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నవారు డాక్టర్ సలహాలను తప్పక పాటిస్తూ మందులు వాడాలి.
8 నుంచి 10 రోజుల వరకు..
ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నవారికి జ్వరం, తీవ్రమైన ఒంటినొప్పులు కొనసాగుతుంటే తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు ఆస్పత్రిలో చేరడం మంచిది. ఈ దశలో వైద్యులు రెమ్‌డెసివిర్ వంటి యాంటీవైరల్ ఇంజక్షన్లు, రక్తం గడ్డకట్టకుండా నిరోధించే మందులు ఇవ్వాలేమో పరిశీలిస్తారు. మరికొన్ని పరీక్షలు కూడా చేసి, ఇతర సమస్యలేమైనా ఉంటే వాటికీ మందులిస్తారు. ఆక్సిజన్ స్థాయి 95 కంటే తగ్గినవారికి ఆక్సిజన్ పెడతారు.
11 నుంచి 14 రోజుల వరకు..
అవసరాన్నిబట్టి యాంటీ వైరల్ మందులు, రక్తం పలచబడటానికి ఇంజక్షన్లు, ఆక్సిజన్ స్థాయులు తగ్గితే స్టిరాయిడ్ ఇంజక్షన్లు ఇస్తారు. అవసరాన్ని బట్టి ఆక్సిజన్ ఇవ్వడం కొనసాగిస్తారు. లక్షణాలు పూర్తిగా తగ్గిపోయి, కనీసం మూడు రోజులపాటు ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే, ఆక్సిజన్ స్థాయులు 95 శాతం ఉంటున్నవారిని డిశ్ఛార్జ్ చేస్తారు.
ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నవారికి ఏ అయిదో రోజుకో వ్యాధి లక్షణాలు తగ్గిపోతే?
ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలేమీ లేనివారు ఐసొలేషన్‌లో కొనసాగుతూ, వైద్యులు సూచించిన సాధారణ మందులు వేసుకుంటే సరిపోతుంది. ఊబకాయం, మధుమేహ సమస్యలున్నవారు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, 65 ఏళ్లు దాటినవారిలో.. అయిదో రోజుకు వ్యాధి లక్షణాలు తగ్గినా జాగ్రత్తగానే ఉండాలి. మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో మందులు కొనసాగించాలి. ఆక్సిజన్ స్థాయిల్ని రోజుకు 4 సార్లు పరీక్షించుకోవాలి. ఏడో రోజు గానీ, తర్వాత గానీ మళ్లీ జ్వరం రావడం, ఒంటి నొప్పులు వంటి వ్యాధి లక్షణాలేమైనా మొదలైనా, అలసట పెరుగుతున్నా, కొద్దిపాటి ఆయాసం వచ్చినా.. డాక్టర్‌ను సంప్రదించి, రక్తపరీక్షలు, అవసరమైతే సీటీ స్కాన్ చేయించుకోవాలి. అలాంటి సమస్యలు లేకుండా, వ్యాధి లక్షణాలు ఏ అయిదో రోజుకో తగ్గిపోయినవారు పది రోజుల తర్వాత హోం ఐసోలేషన్ నుంచి బయటకు రావచ్చు. కుటుంబసభ్యులతో మాట్లాడేటప్పుడు కొన్నాళ్లు మాస్క్ కొనసాగించడం మంచిది. 14 రోజుల తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్లడం మంచిది.
ఇవీ చదవండి: