WHIP: ఏ సభ్యుడైనా పార్టీ జారీ చేసిన విప్ ఉల్లంఘించినప్పుడే అనర్హత నిబంధనలు వర్తిస్తాయి తప్ప.. కేవలం పార్టీ ముఖ్యమంత్రి, ఇతర నేతలపై విమర్శలు చేసినంత మాత్రాన కాదని లోక్‌సభ స్పీకర్ కార్యాలయ వర్గాలు వ్యాఖ్యానించాయి. ప్రస్తుతం లోక్‌సభ సభాహక్కుల సంఘం ముందున్న వివిధ పిటిషన్లపై నిర్ణయం తీసుకొనే అంశం గురించి శనివారం విలేకర్లు ఇష్టాగోష్ఠిగా అడిగిన ప్రశ్నలకు ఓ అధికారి ఈ మేరకు బదులిచ్చారు. సభ్యుల అనర్హత కోసం వచ్చిన పిటిషన్లు సభాహక్కుల సంఘం ముందున్నాయన్నారు. ఇప్పటివరకు రెండు సమావేశాలు జరిగాయని, నిబంధనల ప్రకారం వాటిపై విచారణ చేపట్టి హక్కుల సంఘం తగిన సిఫార్సులు చేస్తుందని తెలిపారు.
* సభాహక్కులకు పరిమితులున్నాయి. బ్రిటిష్ కాలంలో.. సభలో మాట్లాడిన అంశంపై బయట కేసులు పెడుతున్నారన్న ఉద్దేశంతో అప్పట్లో సభాహక్కుల నిబంధనలు తీసుకొచ్చారు. సభ్యులకు సభలో మాట్లాడే హక్కు ఉంటుందని చెప్పడం దాని ఉద్దేశం. అలాకాకుండా సభ వెలుపల జరిగే అంశాల్లో ఎంపీలపై చర్యలు తీసుకున్నా, వారికి ఇంకేదైనా అన్యాయం జరిగినా లోక్‌సభ అధికారులు సంబంధిత సంస్థలతో మాట్లాడి ప్రభుత్వం నుంచి సమాధానం అడుగుతారు. ఏ ఎంపీనైనా అరెస్టుచేస్తే 24 గంటల్లోగా స్పీకర్‌కు సమాచారం ఇవ్వాలి. క్రిమినల్ కేసుల్లో పోలీసులు ఎంపీలను అరెస్టు చేయొచ్చు. అందుకు స్పీకర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత సమాచారం అందిస్తే సరిపోతుంది.
* తమకందే ఫిర్యాదులన్నింటిపై సభాహక్కుల సంఘం ఒకేలా వ్యవహరిస్తుంది. అందులో తేడా ఉండదు. బండి సంజయ్‌ని అరెస్టు చేసినప్పుడు 24 గంటల్లోగా సమాచారం అందించలేదు కాబట్టి దాన్ని సీరియస్‌గా తీసుకుని.. డీజీపీ, పోలీస్ కమిషనర్లను పిలిపించి సాక్ష్యాలు తీసుకున్నారు. మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా కేసులోనూ అలాగే చేశారు. రఘురామకృష్ణరాజు అరెస్టు విషయాన్ని 24 గంటల్లోగానే చెప్పారు.
* ఎంపీలపై థర్డ్ డిగ్రీ ప్రయోగం అన్నది పార్లమెంటు విధులతో ముడిపడిన అంశం కాదు. ఏ ఎంపీనైనా పార్లమెంటు విధుల నిర్వహణ విషయంలో అడ్డుకుంటేనే అది సభాహక్కుల ఉల్లంఘన కిందికొస్తుంది. దానిపై చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం ప్రక్రియ నడుస్తుంది. బయట ఎక్కడైనా గొడవ పడితే అది సభ పరిధిలోకి రాదు.
* సభ బయట ఎంపీల విధులకు సంబంధం లేని విషయాల్లో దాడి జరిగితే వారు కోర్టుకు వెళ్లొచ్చు. ప్రతిదానికీ చర్యలు తీసుకోవడానికి వేర్వేరు వ్యవస్థలున్నాయి.
* సభ్యుల అనర్హత పిటిషన్‌పై చర్యకు నిర్దిష్ట సమయం లేదు. అందుకే అది చర్చనీయాంశంగా మారింది. దానిపై దేహ్రాదూన్ స్పీకర్ల సదస్సులో చర్చ జరిగింది. ఇలాంటి పిటిషన్లపై నిర్దిష్ట సమయంలోగా నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తమైంది. అందుకే దానిపై కమిటీ ఏర్పాటుచేశారు. అది విభిన్న అంశాలపై అధ్యయనం చేస్తోంది.
* ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు ఫిర్యాదుచేశారు. అయితే పార్టీ నేతలపై విమర్శలు చేయడం అనర్హత కిందికి రాదు. విప్ ఉల్లంఘిస్తేనే అనర్హత అవుతుందని 10వ షెడ్యూల్‌లోని నిబంధనలు చెబుతున్నాయి.
* 10వ షెడ్యూల్‌లో మార్పులు చేయాలి. దానిపై సమీక్ష జరగాలి. ఇందుకు ఏర్పాటుచేసిన కమిటీ నివేదిక ఇచ్చింది. అందులో ఏకాభిప్రాయం సాధించిన అంశాలను ప్రభుత్వానికి పంపుతారు. వాటిని పరిగణనలోకి తీసుకొని ఆ షెడ్యూలుకు సవరణలు చేస్తూ బిల్లు తీసుకురావాలా.. వద్దా? అని నిర్ణయం తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
ఇవీ చదవండి: