‘ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్ని హైకోర్టుల అనుమతి లేకుండా ఉపసంహరించేందుకు వీల్లేదు. ఇప్పటికే ఉపసంహరించుకున్న వాటిని హైకోర్టులు సమీక్షించాలి’ అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం జారీచేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో ఎవరెవరిపై ఏయే కేసులు ఉపసంహరించిందనే విషయం మరోమారు చర్చనీయాంశమైంది. అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై 2019 మే కంటే ముందు నమోదైన వాటిలో 45 కేసుల్ని వైకాపా అధికారంలోకి వచ్చాక ఎత్తేసింది. విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండగానే వాటిల్లో చాలా కేసుల్ని తీసేసింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌లు సామినేని ఉదయభాను, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, జోగి రమేష్, మల్లాది విష్ణు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మేకా వెంకటప్రతాప అప్పారావు, ఆర్‌కే రోజా, విడదల రజని, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై ఉన్న కేసుల్ని ఎత్తేశారు.
వివిధ కారణాలు..
జగన్‌పై నమోదైన కేసుల్లో కొన్నింటిని తప్పుడువని, మరికొన్నింటిని ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ పేరిట, ఇంకొన్నింటిని ఆధారాలు లేవని.. ఇలా న్యాయస్థానంలో క్లోజర్ రిపోర్టులు దాఖలుచేసి ఎత్తేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై నమోదైన కేసుల్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ఆయా కేసుల్లో విచారణను ఉపసంహరించుకుంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పిటిషన్ దాఖలు చేయించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీచేసి తీసేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పిటిషన్ దాఖలు చేయించేందుకు వీలు కల్పించే సీఆర్‌పీసీలోని సెక్షన్ 321 దుర్వినియోగం అవుతోందని సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. అలా ఎత్తేసిన కేసుల వ్యవహారమూ చర్చనీయాంశమైంది.
ఎవరెవరిపై ఏయే కేసులు ఎత్తేశారు.. వివరాలు ఇలా ...
- వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి
- ఎత్తేసిన కేసులు: 15
చూపించిన కారణాలు: తప్పుడు (ఫాల్స్) కేసులంటూ కొన్నింటిని, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటూ మరికొన్నింటిని, మిస్టేక్ ఆఫ్ లా, ఆధారాలు లేవని ఇంకొన్నింటిని ఎత్తేశారు. ఆయా కేసుల్లో దర్యాప్తు అధికారులు న్యాయస్థానాల్లో క్లోజర్ రిపోర్ట్ దాఖలుచేసి ఆ కేసుల్ని తీసేశారు. చర్యల ఉపసంహరణ పేరిట కొన్ని కేసుల్ని న్యాయస్థానాల్లో విచారణ అవసరం లేకుండా మూసేశారు. వీటిలో 11 కేసుల ఎత్తివేతపై హైకోర్టు ఇటీవల సుమోటోగా విచారణ చేపట్టింది.
ఉపసంహరించుకున్న కేసుల వివరాలు
2017 ఫిబ్రవరి 28న కృష్ణాజిల్లా నందిగామ వద్ద జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదంలో 9 మంది చనిపోయారు. వారి మృతదేహాలకు శవపరీక్ష చేస్తుండగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, కొలుసు పార్థసారధి, సామినేని ఉదయభాను తదితరులు గదిలోకి చొరబడి వైద్యాధికారిణిని అడ్డుకున్నారని, ఆమెతో వాగ్వాదానికి దిగి హెచ్చరించారన్న ఫిర్యాదులపై నందిగామ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు.
* అల్లర్లకు పాల్పడ్డారని, మారణాయుధాలు కలిగి ఉన్నారని, ప్రభుత్వోద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలిగించి నేరపూరిత బలప్రయోగం చేశారని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని, అక్రమ చొరబాటు, నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్న ఆరోపణలపై పులివెందుల పోలీసుస్టేషన్‌లో 2011లో నమోదైన కేసు.
* నేరపూరిత కుట్ర, ఫోర్జరీ పత్రాల వినియోగం, అవతలి వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఫోర్జరీ పత్రాల వినియోగం, ట్యాంపరింగ్, చట్టవిరుద్ధంగా సెల్‌ఫోన్ సందేశాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై చిలకలూరిపేట పట్టణ, నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లలో 2015లో నమోదైన రెండు వేర్వేరు కేసులు.
* వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారంటూ మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన ఆరు కేసులు.
* అప్పటి సీఎం చంద్రబాబును చచ్చేంతవరకూ చెప్పులతో కొట్టాలని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసి గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య సృష్టించారన్న ఫిర్యాదులపై అనంతపురం జిల్లా నల్లచెరువు, యాడికి, పెదవడగూరు, అనంతపురం రెండో పట్టణ, పుట్టపర్తి అర్బన్ పోలీసుస్టేషన్ల పరిధిలో నమోదైన 5 వేర్వేరు కేసులు.
- సామినేని ఉదయభాను, ప్రభుత్వ విప్
- ఎత్తేసిన కేసులు: 10
వివరాలు: అక్రమ నిర్బంధం, నేరపూరిత బెదిరింపు, అపహరణ, ప్రభుత్వ ఉద్యోగిపై నేరపూరిత బల ప్రయోగానికి దిగడం లాంటి ఆరోపణలతో నమోదైన ఈ పది కేసులు విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయి. వాటన్నింటినీ ప్రభుత్వం ఒకేసారి ఎత్తేసింది. ఈ కేసుల ఎత్తివేతపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ నడుస్తోంది.
* సీఎస్‌పీఏ పేరిట సర్వే చేస్తున్నవారిని నిర్బంధించారని, వారిని అపహరించి నేరపూరితంగా బెదిరించారన్న ఫిర్యాదుపై జగ్గయ్యపేట పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు.
* జగ్గయ్యపేట ఎన్టీఆర్ సర్కిల్‌లో ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు ఆర్‌అండ్‌బీ ఏఈఈ విధులకు ఆటంకం కలిగించటం, నేరపూరిత బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసు.
* చట్టవిరుద్ధంగా భారీ ప్రదర్శన నిర్వహించారని, ధర్నాలతో ప్రజలకు ఇబ్బంది కలిగించారన్న ఫిర్యాదులపై జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు స్టేషన్లలో నమోదైన పలు కేసులు.
- జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే, రాజానగరం
- ఎత్తేసిన కేసులు: 2
వివరాలు: పోలీసు అధికారుల్ని అసభ్య పదజాలంతో దూషించి.. వారి అంతు చూస్తానంటూ బెదిరించారన్న ఆరోపణలపై గతంలో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో వీటి విచారణ సాగుతుండగా వాటిని ఎత్తేశారు.
* ‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి నిరసనగా 2016 నవంబరు 28న నిర్వహించిన భారత్‌బంద్‌లో జక్కంపూడి రాజా, ఆయన అనుచరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఏవీఏ రోడ్డులోని స్పెన్సర్ షాపు మేనేజర్‌పై దుర్భాషలాడి, ఆయనను కొట్టారు. అతన్ని రక్షించేందుకు నేను వెళ్లగా నన్ను అసభ్య పదజాలంతో దూషించి.. నా అంతు చూస్తానని బెదిరించారు. నా విధి నిర్వహణకు ఆటంకం కలిగించారు’ అని ఆర్.సుబ్రమణ్యేశ్వరరావు అనే ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రకాశ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన కేసు.
* పోలీసు అధికారుల్ని బెదిరించేలా ప్రసంగించారన్న ఆరోపణలపై రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు.
- పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాజంపేట ఎంపీ, వైకాపా లోక్‌సభ పక్ష నేత
- ఎత్తేసిన కేసులు: 3
వివరాలు: 2019 లోక్‌సభ ఎన్నికల్లో సమర్పించిన అఫిడ్‌విట్ ప్రకారం మిథున్‌రెడ్డిపై మూడు కేసులున్నాయి. ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో వీటి విచారణ సాగేది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ కేసుల్ని ఎత్తేసింది.
* తన సంబంధీకులు 15 మందికి బోర్డింగ్ పాస్‌లు ఇవ్వాలని మిథున్‌రెడ్డి కోరగా నిరాకరించినందుకు రేణిగుంట విమానాశ్రయంలో ఎయిరిండియా మేనేజర్ ఎస్.రాజశేఖర్‌పై దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఫిర్యాదుపై ఏర్పేడు పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు.
* ఎంవీ కృష్ణారెడ్డి, మరో నలుగురు వెళ్తున్న వాహనాన్ని అడ్డగించి, రక్తమోడేలా గాయపరిచారన్న అభియోగంపై 2009లో సదుం పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు
* ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా పీహెచ్‌సీని ప్రారంభించి అక్రమ చొరబాటుకు పాల్పడ్డారనే అభియోగంతో కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీసుస్టేషన్‌లో 2015లో నమోదైన కేసు.
- గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ
- ఎత్తేసిన కేసు: 1
వివరాలు: 2019 ఎన్నికల పోలింగ్ రోజున అహోబిలం ప్రభుత్వ పాఠశాల వద్ద గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి వర్గం, భార్గవ్‌రామ్ వర్గం చట్టవిరుద్ధంగా గుమికూడి పరస్పరం కర్రలు, రాళ్లు విసురుకుని దాడి చేసుకున్నారని కేసు నమోదైంది. హత్యాయత్నం, మారణాయుధాలతో అల్లర్లు, ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించటం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం తదితర అభియోగాలపై నమోదైన కేసులో బ్రిజేంద్రనాథ్‌రెడ్డి నిందితుడు. ఆళ్లగడ్డ అసిస్టెంట్ సెషన్స్ న్యాయస్థానంలో విచారణలో ఉన్న ఈ కేసును ఎత్తేసింది.
- వైఎస్ అవినాష్‌రెడ్డి కడప ఎంపీ, ముఖ్యమంత్రి జగన్ బంధువు
- ఎత్తేసిన కేసు: 1
వివరాలు: నేరపూరిత బెదిరింపు, ఉద్యోగుల అడ్డగింత అభియోగాలతో కడప జిల్లా తొందూర్ పోలీసుస్టేషన్ పరిధిలో 2015లో కేసు నమోదైంది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో ఈ కేసు విచారణ సాగింది. దాన్ని ఉపసంహరించారు.
- జోగి రమేష్, ఎమ్మెల్యే, పెడన
- ఎత్తేసిన కేసు: 1
వివరాలు: 2017 ఫిబ్రవరి 28న కృష్ణాజిల్లా నందిగామ వద్ద జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తుండగా జోగి రమేష్, కొందరు వైకాపా నాయకులు చట్టవిరుద్ధంగా గుమిగూడారన్న ఫిర్యాదుపై నందిగామ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. నందిగామలోని అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణ నడుస్తుండగా దాన్ని ఎత్తేశారు.
- పేర్ని వెంకట్రామయ్య (నాని), రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి
- ఎత్తేసిన కేసు: 1
వివరాలు: ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారని, ప్రభుత్వోద్యోగిని విధులు నిర్వర్తించనీయకుండా అతనిపై బలప్రయోగానికి దిగారని, ధర్నాకు పాల్పడ్డారనే అభియోగంతో బందరు తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో 2015లో కేసు నమోదైంది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో ఈ కేసు విచారణ నడుస్తుండగా దాన్ని ఎత్తేశారు.
- కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే, సర్వేపల్లి
- ఎత్తేసిన కేసు: 1
వివరాలు: తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఫోర్జరీ పత్రాలు సృష్టించి మోసం చేశారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై నెల్లూరు జిల్లా గ్రామీణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. నెల్లూరు నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో విచారణ నడుస్తుండగా దీన్ని ఎత్తేశారు.