విశాఖ జిల్లాలో..
నిర్భయ నుంచి దిశ వరకు మహళలపై జరుగుతున్న ఆకృత్యాలకు నిరసనగా విశాఖపట్నంలో ప్రజా గాయకుడు దేవిశ్రీ తన గళాన్ని విప్పారు. విశాఖ నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద చైతన్య గీతాన్ని ఆలపించారు. దిశ ఘటనపై మహిళలే కాదు.. సమాజం మొత్తం జాగురూకతతో మెలగాలని పాటలో హెచ్చరించారు. నిర్భయ, ఆయేషా, లక్ష్మీ, దిశ... ఇలా ఎంతమంది సోదరీమణులు బలైపోవాలంటూ ప్రశ్నించారు.
మహిళలకు రక్షణ చట్టాలపై అడ్డరోడ్డులో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణకు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో భరోసా కల్పించేందుకు సిద్ధంగా ఉందని నర్సీపట్నం ఏఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. కాలేజీల్లో, పాఠశాలల్లో ఎవరైనా మానసిక వేధింపులు, ఈవ్ టీజింగ్లకు పాల్పడితే సమచారం అందించాలన్నారు. ఆపదలో ఉంటే 100, 112, 181 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
పి. గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బాలికలు దిశకు నివాళులర్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
కృష్ణా జిల్లాలో..
దిశ హత్య కేసులో నిందితులను శిక్షించాలని కోరుతూ ఏపీ అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు విజయవాడ శివారులో నిరసన బాట పట్టారు. మహిళలు, యువతులు తిరగాలంటే భయపడే పరిస్థితి నెలకొంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు మక్తకంఠంతో కోరారు.
కంచికచర్లలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, వాటిని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లాలో..
గుంటూరులో నర్శింగ్, పారా మెడికల్ విద్యార్థులు నిరసన బాట పట్టారు. దిశకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. నిందితులను జైల్లో రాచమర్యాదలు చేయకుండా వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లాలో...
తిరుపతి ఐద్వా, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు, ఐద్వా, డీవైఎఫ్ఐ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అంతర్గత కమిటీలు వేయాలన్నారు.
పుత్తూరులో ప్రైవేటు సంస్థల విద్యార్థులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. స్థానిక కార్వేటినగరం కూడలిలో మానవహారం నిర్వహించారు. అనంతరం ఎస్ఐ మల్లికార్జున రెడ్డికి వనతిపత్రాన్ని అందజేశారు. దిశను హత్య చేసిన నిందితులను ఉరివేసి... వారి కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలిగించాలని పేర్కొన్నారు.
కడప జిల్లాలో..
కడప జిల్లా రాజంపేటలో విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు వేల మంది విద్యార్థినులు నిరసన చేపట్టారు. హత్యచేసిన దుర్మార్గులను వదిలి పెట్టవద్దని నినాదాలు చేశారు. భవిష్యత్తులో ఏ ఆడబిడ్డ ఇలాంటి దారుణానికి గురికాకుండా ఉండే విధంగా శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలో..
కర్నూలులో మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం ముందు మానవహారం చేపట్టారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురంలో మహిళా ఐక్య సంఘాలు, విద్యార్థులు మానవహారం చేపట్టారు. మహిళలకు రక్షణ కల్పించని ప్రభుత్వాలు దిగిపోవాలని... మహిళా రక్షణకు పాటుపడే ప్రభుత్వం తమకు కావాలని నినాదాలు చేశారు. పోలీసులు మహిళల రక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దిశ బాధితులను ఉరి తీయాలని.... లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
మొత్తానికి దిశ ఘటనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి :