New districts different voices: కొత్త జిల్లాల ప్రారంభోత్సవ సంబరాల్లో కొన్ని చోట్ల భిన్నస్వరాలు వినిపించాయి. నంద్యాల జిల్లా ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేలు సోమవారం అలకపాన్పు ఎక్కారు. సీఎంతో వర్చువల్ సమావేశం అనంతరం శిలాఫలకం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యేలు దానిపై తమ పేరు లేకపోవడంపై అభ్యంతరం తెలిపారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఛైర్మన్లు, అధికారుల పేర్లు ఉన్నాయి. తమ పేర్లు ఎందుకు లేవంటూ శిల్పాచక్రపాణిరెడ్డి, ఆర్థర్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, రామిరెడ్డి, బ్రిజేంద్రరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీనిపై వారు కలెక్టర్ మనజీర్ జిలానీని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం భవన ప్రారంభోత్సవానికి వెళ్లగా అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆగ్రహించిన శిల్పాచక్రపాణిరెడ్డి శిలాఫలకంపై తమ పేర్లు వేయకపోవడం చాలా తప్పు అని, దీనిపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.
అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల గైర్హాజరు: అన్నమయ్య జిల్లా ఆవిర్భావ వేడుకలకు ఒకరు మినహా అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటిలో జరిగిన కార్యక్రమాల్లో ఆయనతోపాటు జిల్లా పరిధి పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాత్రమే పాల్గొన్నారు. జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి వచ్చి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. జిల్లాలోని ఇతర అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వేడుకలకు రాలేదు.
బొల్లాపల్లిని పాత రెవెన్యూ డివిజన్‌లోనే ఉంచాలి: ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం నిన్నటివరకు నరసరావుపేట రెవెన్యూ డివిజన్‌లో కొనసాగిందని, పల్నాడు జిల్లా ఏర్పాటు నేపథ్యంలో అధికారులు దీన్ని గురజాల డివిజన్‌లో కలిపారని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (వైకాపా) పేర్కొన్నారు. దీన్ని నరసరావుపేట డివిజన్‌లో కలపకుంటే కలెక్టరేట్ వద్ద బైఠాయిస్తానని హెచ్చరించారు. పల్నాడు జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. జిల్లాల పునర్విభజన తనకు అసంతృప్తి మిగిల్చిందన్నారు.
కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలి: మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంచాలని, కోనసీమ జిల్లాలో వద్దంటూ వివిధ పార్టీలు, సంఘాలతో ఏర్పడిన ఐకాస ఆధ్వర్యంలో మండపేటలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. తెదేపా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు స్థానిక కలువపువ్వు సెంటరులో రాస్తారోకో చేశారు. మరోవైపు కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు నిర్ణయించకపోవడంపై దళిత సంఘాల నాయకులు అమలాపురంలోని నూతన కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.దళితుల ఓట్లతో గెలిచి దళితుల డిమాండ్‌ను పట్టించుకోరా అని ప్రశ్నించారు. డీఎస్పీ మాధవరెడ్డి సర్దిచెప్పినా వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని అంబాజీపేట పోలీసుస్టేషన్‌కు తరలించారు.
హిందూపురంలో నిరసన: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ప్రకటించాలన్న డిమాండ్‌ను పట్టించుకోకపోవడంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. హిందూపురంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద నల్లజెండాలతో రాస్తారోకో నిర్వహించారు. గెజిట్ కాపీలను చించి తగల బెట్టారు. ఆందోళనలో అఖిల పక్షం నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, బాలాజీ మనోహర్, రమేష్‌రెడ్డి, రమేష్, చలపతి, ఆకుల ఉమేష్, ఉమర్‌ఫారుఖ్, ఓపీడీఆర్ శ్రీనివాసులు, జేపీకే రాము పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వికేంద్రీకరణే మా విధానం.. కొత్త జిల్లాలతో ప్రజలకు మెరుగైన పాలన: సీఎం జగన్