చిన్నారి రమ్య గుర్తుందా..? 2016 జులై 1న హైదరాబాద్ పంజాగుట్ట నాగార్జున సర్కిల్ సమీపంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మద్యం తాగి అతివేగంగా కారు నడుపుతుండగా అది అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి అటువైపు వస్తున్న రమ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై పడింది. అంతే తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆ చిరు నవ్వులకు నూరేళ్లు నిండాయి. రమ్య తాతయ్య, బాబాయి దుర్మరణం పాలయ్యారు. తల్లి, మరో బాబాయి తీవ్ర గాయాల పాలయ్యారు. వీరి చికిత్సలకు ప్రభుత్వం నుంచి పరిహారంగా ఇచ్చిన డబ్బు పోను మరో రూ.30 లక్షల వరకు ఖర్చయ్యాయి. అయిదేళ్ల క్రితం తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ ఘోర దుర్ఘటనపై ఇప్పటివరకు కోర్టు విచారణే ప్రారంభం కాలేదు. అభియోగపత్రాలు దాఖలు చేశామంటూ పోలీసులు చేతులు దులుపుకొన్నారు.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో నిందితులకు శిక్ష వేయిస్తామని చెప్పిన పెద్దల మాటలు గాల్లో కలిసిపోయాయి... ఇంతటి ఘోరప్రమాదానికి కారణమైన యువకుడు మాత్రం బెయిల్‌పై బయటికి వచ్చేశాడు. 21 ఏళ్లలోపు ఉన్నవారికి మద్యం అమ్మకూడదనే నిబంధనను విస్మరించిన బార్ యాజమాన్యం ఏడాది తర్వాత మళ్లీ యథావిధిగా వ్యాపారం చేస్తోంది. కానీ ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి, కన్నూమిన్నూకాననితనానికి పచ్చటి సంసారం ఛిన్నాభిన్నమైపోయింది. ‘రమ్య జ్ఞాపకాలు ఇప్పటికీ మమ్మల్ని వెంటాడుతున్నాయి. మాకు తీరని అన్యాయం జరిగింది.నిందితులకు శిక్ష పడాల్సిందే..’ అని రమ్య తండ్రి వెంకటరమణ పేర్కొన్నారు.
లారీ బీభత్సం...
- తెలంగాణలో సంగారెడ్డి పట్టణంలో 2019 మే 26న రాత్రి 10.30 గంటల సమయంలో కంటెయినర్ లారీ బీభత్సం సృష్టించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ రాధేశ్యాం(25) తన లారీతో 4 బైక్‌లు, 2 కార్లను ఢీకొట్టాడు. నడుచుకుంటూ వెళ్తున్న గొల్ల పెంటయ్య(46)పైకి దూసుకెళ్లడంతో అతడు అక్కడిక్కడే మృతిచెందారు. ఘటనాస్థలంలోనే దొరికిన రాధేశ్యాం మద్యం మత్తులో ఉన్నట్లు రుజువు కావడంతో కేసు నమోదు చేశారు. సంగారెడ్డి సీటీవో కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న పెంటయ్య మృతిచెందడంతో ఆ కుటుంబం పెద్దను కోల్పోయింది. భర్త మరణించడంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు ఎలాగో తెలియక ఉమ సతమతమవుతోంది. రాధేశ్యాం మాత్రం బెయిల్‌పై బయటికి వచ్చాడు. న్యాయస్థానంలో విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం కేసు ఏ దశలో ఉందో ఆ కుటుంబానికి తెలియని పరిస్థితి. ‘మా ఆయన చనిపోయినప్పుడు ఆయన స్థానంలో ఉద్యోగం ఇప్పిస్తామని అధికారులు చెప్పారు. ఇప్పుడందరూ మొహం చాటేశారు. రైతుబీమా సొమ్ము తప్ప ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియడం లేదు..’ అని పెంటయ్య భార్య ఉమ వాపోయారు.
ఈ తరహా ప్రమాదాలకు కారణమైన వారిపై కఠినమైన 304 పార్ట్ 2 సెక్షన్ ప్రయోగించి పదేళ్ల వరకు శిక్ష వేయిస్తామన్న హామీలు అటకెక్కాయి.
- 2019లో ప్రమాదాలు: 21,570
- ఇందులో అతివేగం అని నమోదైనవి: 20,669 (95.82 శాతం)
- డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు: 246
- మరణాలు: 68
- ఢీకొట్టి వెళ్లిపోయిన కేసులు: 2,300
- చనిపోయినవారు: 749
- తీవ్రగాయాలు: 154
ఏం చెప్పారు?
రమ్య దుర్ఘటన అనంతరం అప్రమత్తమైన పోలీస్‌శాఖ 304 పార్ట్ 2 ఐపీసీ సెక్షన్‌ను తెరపైకి తెచ్చింది. హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా తమ చర్య వల్ల మరణం తప్పదని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై దీన్ని ప్రయోగిస్తారు. మద్యం మత్తులో లేదా నిర్లక్ష్యపూరితంగా లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపి మరణానికి కారకులైన వారిని ఈ సెక్షన్ కింద అరెస్టుచేస్తారు. దీనికింద నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంది. భారతీయ శిక్షాస్మృతిలో ఈ సెక్షన్ అప్పటికే ఉన్నా రమ్య విషాదాంతం తర్వాతే రాష్ట్రంలో దీన్ని ప్రయోగించడం ముమ్మరం చేశారు. దీనివల్ల వాహనదారుల్లో భయం ఉంటుందని పోలీసు ఉన్నతాధికారుల ఉద్దేశం.
ఏం జరిగింది?
కానీ నిందితులకు శిక్ష మాత్రం పడడం లేదు. ఏళ్లు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఘోరం జరిగిన అయిదేళ్లయినా రమ్య విచారణ ఇంకా ఆరంభం కాలేదు. అకారణంగా ప్రాణాలు కోల్పోయేందుకు కారకులవుతున్న వారిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో విచారణ ద్వారా శిక్ష పడినప్పుడే భయం ఉంటుంది. దురాగతాలు కొంతమేరకైనా ఆగుతాయి. సాధారణంగా డ్రంకెన్ ప్రమాదాలు రాత్రివేళల్లోనే ఎక్కువగా జరుగుతాయి. కానీ ఆ సమయంలో ఢీకొట్టి పారిపోతున్న మందుబాబుల గురించి ఆరా తీయడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. వాహనం డ్రైవర్ దొరకని పక్షంలో ఆ కేసును అతివేగం ఖాతాలో వేస్తున్నారు.
ఇదీచూడండి: