వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలంగాణలోని విద్యాసంస్థల్లో తొలిసారిగా బ్యాచులర్ ఆఫ్ డిజైన్ కోర్సు అందుబాటులోకి రానుంది. సిరిసిల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా అది ఉంటుంది. హైదరాబాద్‌లోని నిఫ్ట్ సహకారంతో ఆ కోర్సును ప్రారంభిస్తున్నారు.
ఈ క్రమంలో ఆ కోర్సు విధివిధానాల రూపకల్పనపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి సమక్షంలో శనివారం శాతవాహన వర్సిటీ ఉపకులపతి మల్లేశం, నిఫ్ట్ ప్రతినిధులు అన్నాజీ శర్మ, అవినాశ్, ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ మామిడాల, గురుకుల సంస్థ ప్రతినిధి ఏఎస్‌ఎన్ పావని తదితరులు చర్చించారు. లింబాద్రి మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంతం చేనేత పరిశ్రమకు కేంద్ర బిందువుగా ఉన్నందున అక్కడ డిజైన్ కోర్సును ప్రవేశపెట్టడం మంచి ఆలోచన అంటూ అధికారులను అభినందించారు.
ఇదీ చదవండి: కేసుల సత్వర పరిష్కారానికి చొరవ చూపాలి: హైకోర్టు న్యాయమూర్తులు