ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో వేతనాలందక వారంతా అవస్థలు పడుతున్నారు. వారంనుంచి పది రోజుల్లో చెల్లించే వేతనాలు ఏడు వారాలైనా అందలేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.1,878 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండేళ్లుగా ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు కొవిడ్‌తో మళ్లీ స్వగ్రామాలకు చేరుకొని నరేగా పనులకు వెళుతున్నారు. గత నెలలో ఒకేరోజు 35 లక్షల మందికిపైగా పనుల్లో పాల్గొన్నారు. ఇప్పటికీ రోజూ 28 లక్షల నుంచి 30 లక్షలమంది హాజరవుతున్నారు. గతేడాది వారంనుంచి పది రోజుల్లో కూలీలకు చెల్లింపులు జరిగేవి. 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి వేతనాల చెల్లింపుల్లో జాప్యమవుతోంది. రాష్ట్రంలో మే27 నుంచి ఇప్పటివరకు చేసిన పనులకు వేతనాలు చెల్లించలేదు. 6వారాలకు సంబంధించి ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లను (ఎఫ్‌టీవో) సిబ్బంది అప్‌లోడ్ చేశారు.
ఎన్‌ఈఎఫ్‌ఎం విధానంతో నేరుగా కూలీల ఖాతాల్లోకి
జాతీయ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఈఎఫ్‌ఎం)విధానం 2017లో ప్రవేశపెట్టాక కూలీల బ్యాంకు ఖాతాల్లోకి వేతనాలు నేరుగా జమవుతున్నాయి. కూలీలు చేసిన పనులపై కొలతలు తీసి ఎఫ్‌టీవోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం వరకే రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర పరిమితమైంది. నరేగా పనితీరుపై వివిధ రాష్ట్రాల అధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి దిల్లీ నుంచి ఇటీవల నిర్వహించిన వీడియో సమావేశంలో కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యాన్ని వివిధ రాష్ట్రాలు ఆయన దృష్టికి తీసుకెళ్లాయి. త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని కార్యదర్శి హామీనిచ్చినా ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు.
ఇదీ చదవండి:
cbn on gazette: 'జలశక్తి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం'
krishna and godavari boards: కృష్ణా, గోదావరి బోర్డులకు విస్తృతాధికారాలు