జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. నామినేషన్లకు చివరి రోజైన ఇవాళ ఒక్కరోజే 1,561 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం ఇప్పటివరకు 1,663 మంది అభ్యర్థులు... 2,226 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. భాజపా నుంచి 494 , తెరాస నుంచి 493, కాంగ్రెస్ నుంచి 312, ఎంఐఎం నుంచి 66, తెదేపా నుంచి 186, సీపీఐ 15, సీపీఎం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. గుర్తింపు పొందిన పార్టీల నుంచి 86, స్వతంత్య్ర అభ్యర్థుల నుంచి 550 నామినేషన్లు వచ్చాయి.
రేపు పరిశీలన...
నామినేషన్ల ప్రక్రియ ముగియడం వల్ల రేపు నామినేషన్లను పరిశీలన చేయనున్నారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఫార్మ్- బీ రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకు అందించే అవకాశం ఎస్ఈసీ కల్పించింది.
ర్యాలీగా వచ్చి...
బల్దియా పరిధిలోని ఆయా డివిజన్లలో తెరాస అభ్యర్థులు ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని తెరాస అభ్యర్థుల వెంట మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చి నామపత్రాలు సమర్పించారు. బేగంబజార్ అభ్యర్థి పూజావ్యాస్ భారీ ర్యాలీ నిర్వహించగా... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట వచ్చి నామినేషన్లు సమర్పించారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని సనత్ నగర్ అభ్యర్థి కొలను లక్ష్మీరెడ్డి పేర్కొన్నారు. భారీ ప్రదర్శనతో నామినేషన్ సమర్పించారు.
బల్దియా కోటపై గులాబీ కోట...
బల్దియా కోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని బోరబండ అభ్యర్థిగా నామపత్రాలు సమర్పించిన డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో పూజల అనంతరం రాంగోపాల్‌పేట డివిజన్ తెరాస అభ్యర్థి అరుణ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ పాల్గొన్నారు.
ఐఎస్‌సదన్ డివిజన్‌లో తెరాస అభ్యర్థి సామ స్వప్న సుందర్ రెడ్డి నిర్వహించిన భారీ ర్యాలీగా తరలివచ్చి నామపత్రాలు సమర్పించారు. సైదాబాద్ తెరాస అభ్యర్థి స్వర్ణలత రెడ్డి అనుచరగణంతో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. కాప్రా ఒకటో డివిజన్ తెరాస అభ్యర్థి స్వర్ణరాజ్ , రెండో డివిజన్ అభ్యర్థి పావని మణిపాల్ రెడ్డి నామపత్రాలు సమర్పించారు.
భారీ ప్రదర్శనలు...
భాజపా అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. భారీ ప్రదర్శనలు నిర్వహించి నామపత్రాలు సమర్పించారు. గుడిమల్కాపూర్ భాజపా అభ్యర్థి కరుణాకర్ ... కార్వాన్ లోని దర్బార్ మైసమ్మ దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు.
మంచి, చెడుకు మధ్య జరుగుతున్న సంగ్రామంలో తన గెలుపును ఎవరూ ఆపలేరని వెంగళరావునగర్ అభ్యర్థి కిలారి మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. అంబర్ పేట్ భాజపా అభ్యర్థి పద్మవెంకట్ రెడ్డి, జాంబాగ్ భాజపా అభ్యర్థి రూప్ ధరక్ నామినేషన్లు దాఖలు చేశారు.
నామపత్రాల దాఖలు...
చాంద్రాయణగుట్ట పరిధిలోని కంచన్‌బాగ్ భాజపా అభ్యర్థి రోజా, జంగంమెట్ నుంచి మహేందర్, చాంద్రాయణగుట్ట అభ్యర్థి నవీన్ కుమార్ నామపత్రాలు సమర్పించారు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట సర్కిల్ ఏడో డివిజన్‌కు సంబంధించిన ఎంఐఎం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జంగంమెట్ డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి అబ్ధుల్ రెహ్మాన్, బార్కస్ డివిజన్ అభ్యర్థి షబాణ బేగం నామినేషన్లు సమర్పించారు.
కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా ఒకటో డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పత్తి కుమార్, రెండో డివిజన్ అభ్యర్థిగా శిరీష రెడ్డి నామినేషన్లు వేశారు. ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి గుర్రం చంద్రకళ శంకర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని గణపతి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
ఇదీ చదవండి
తిరుపతి ఎంపీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా గురుమూర్తి పేరు పరిశీలన