Yadadri brahmotsavam 2022 dates : రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి 14 వరకు జరగనున్నాయి. పదకొండు రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలకు ఇంకా 40 రోజులే మిగిలాయి. మరోవైపు పంచ నారసింహుల ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా నిలిచిపోయిన గర్భాలయంలోని మూలవర్యుల నిజ దర్శనాలకు తెర తీసేందుకు 'మహాకుంభ సంప్రోక్షణ'... తొలుత శ్రీ సుదర్శన మహా యాగం నిర్వహించనున్నారు. ఈ మహాక్రతువులకు రెండు వారాల ముందే వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాల వివరాలు..
ఈ మహాదివ్య పుణ్యక్షేత్రం ఖ్యాతి నలుదిశలా వ్యాపించేలా బాలాలయంలోనే వార్షిక ఉత్సవాలను 2017 నుంచి కొనసాగిస్తున్నారు. ఏటా ఫాల్గుణ మాసంలో నిర్వహించే స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి మార్చి4 నుంచి మొదలవుతాయని దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీస్వామి, అమ్మవార్ల తిరు కల్యాణమహోత్సవం అదే నెల 11(నవమి)న నిర్వహిస్తారు. మార్చి 14న ఏకాదశి రోజున ఉత్సవాలు ముగుస్తాయి.
ముస్తాబవుతున్న యాదాద్రి
మహా సంప్రోక్షణకు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. సీఎం కేసీఆర్ కల సాకారమయ్యే తరుణం సమీపిస్తోంది. స్వయంభూ క్షేత్ర సందర్శనలో మూలవర్యులను దర్శించి పూజించాలని ఎదురుచూస్తున్న భక్త జనులు ఆశను నెరవేర్చేందుకు చినజీయర్ స్వామి ముహూర్తం నిర్ణయించిన విషయం విదితమే. ఈ మహాక్రతువుకు ముందస్తుగా జరపాల్సిన మహాయాగం నిర్వహణకు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్రాభివృద్ధిలో చేపట్టిన పనులను వచ్చే మార్చి 20లోగా పూర్తి చేయడం కోసం... దేవాలయాభివృద్ధి ప్రాధికార సంస్థ కసరత్తులను ముమ్మరం చేసింది. ఈనెల 21న దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... యాదాద్రి క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించారు. మిగిలి ఉన్న పనులపై ఆరా తీశారు. మహాయాగానికి ముందే అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గడువులోగా పూర్తి చేసేందుకు నడుం బిగించింది. ఆ క్రమంలో సంబంధిత అధికారులు, గుత్తేదారులతో ఇటీవల సమావేశం నిర్వహించింది.
నెల రోజుల్లో పనులు పూర్తి!
కొండపైన నిర్మితమవుతున్న నాలుగు అంతస్తులతో కూడిన దర్శన వరుసల సముదాయం మందిర రూపంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యుద్దీకరణ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. సాలహారాల్లో దేవతామూర్తుల విగ్రహాలను పొందుపరచాల్సి ఉంది. రెండు కనుమ దారుల మధ్య 40 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న భారీ స్వాగత తోరణం పనులు ముమ్మరమయ్యాయి. మరో నెల రోజుల్లో పూర్తి అవుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
భక్తుల సౌలభ్యం కోసం సదుపాయాలు..
సీఎం ప్రత్యేక శ్రద్ధతో మంజూరు చేసిన రూ.6 కోట్లతో... ఈ క్షేత్ర సందర్శన కోసం వచ్చే భక్తులకు రవాణా సౌలభ్యం కోసం కొండపైన బస్ బే నిర్మితమవుతోంది. ఆలయానికి ఉత్తర దిశలో క్యూ కాంప్లెక్స్ వద్ద చేపట్టిన బస్ బే కోసం 8 ప్లాట్‌ఫామ్‌ల సిమెంట్ కప్పును ఇటీవలే పూర్తి చేశారు. మిగతా పనులు మార్చి తొలి వారంలోగా పూర్తి కానున్నాయి. పాత కనుమదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. కొండ కింది నుంచి ఆలయానికి చేరే కనుమదారిలో పైవంతెన నిర్మాణానికి అవసరమైన కేబుల్... లండన్ నుంచి రాగానే మిగిలిన పనులను మొదలు పెడతారు. వాటన్నింటిని మార్చి 20లోగా పూర్తి చేస్తామని ఆర్అండ్బీ శాఖ చెబుతోంది.
శరవేగంగా అభివృద్ధి పనులు
కొండ కింద గండిచెరువు ప్రాంగణంలో రూ.8.90 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న దీక్ష పరుల మండపం నిర్మాణం పూర్తయింది. పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 15లోగా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. భక్తుల పుణ్యస్నానాల కోసం రూ.11.35 కోట్లవ్యయంతో నిర్మితమవుతున్న లక్ష్మి పుష్కరిణి నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. విద్యుద్దీకరణతో పాటు పెయింటింగ్, డబుల్ కోటింగ్ పనులు జరగాల్సి ఉంది. రూ.2.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమవుతున్న కల్యాణకట్ట నిర్మాణం సైతం తుది దశకు చేరింది. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యుద్దీకరణ, ప్లంబింగ్ పనులు చేపట్టవలసి ఉంది.
ముమ్మరంగా గ్రీనరీ ఏర్పాట్లు
ధ్వజస్తంభానికి బంగారు తాపడం పూర్తి చేయాలి. ప్రస్తుతం 40 శాతం పనులు జరిగాయి. శ్రీ సత్యనారాయణస్వామి వ్రతమండపం స్లాబ్ పైకప్పు పనులు సాగుతున్నాయి. ఆలయ వనరులైన లక్ష్మిపుష్కరిణి, కల్యాణకట్ట, దీక్షాపరుల మండపం, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతమండప ప్రాంగణాల్లో ఆహ్లాదకరంగా వాతావరణం కల్పించేందుకు గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రకాల చెట్లు. పూలమొక్కలతో తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల