Shortage of DAP ఎరువులు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కొరత వెన్నాడుతూనే ఉంది. డీఏపీపై ఎమ్మార్పీకి మించి రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. దీనికి కారణాలేమిటనే అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో కొనుక్కోండనే మాటలకే పరిమితమవుతోంది. అక్కడ అందుబాటులో ఉన్నాయా? లేవా అనే విషయాన్ని విస్మరిస్తోంది. ఆగస్టు నెలకు 81 వేల టన్నుల డీఏపీ రాష్ట్రానికి చేరాల్సి ఉంటే అందులో ఇప్పటి వరకు సగం కూడా రాలేదు. వాస్తవానికి గతేడాదితో పోలిస్తే.. కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఈ ఖరీఫ్‌లో భారీగా పెరిగాయి. ఒక్కో బస్తాపై సగటున రూ.150 నుంచి రూ.900 వరకు పెరిగింది. దీంతో సగటున ఒక్కో ఎకరంపై రూ.4వేల వరకు పెట్టుబడి పెరుగుతోంది. దీనికితోడు దుకాణదారులు బస్తాకు రూ.50 నుంచి రూ.150 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అదేమంటే రవాణా ఖర్చులతో అధిక భారం పడుతోందని చెబుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇస్తున్నా కొందరికే.. అరకొరగానే లభ్యమవుతున్నాయి. అవీ రాజకీయ ఒత్తిళ్లతో కొందరికే దక్కుతున్నాయి. కొన్ని చోట్ల అందుబాటులోనే ఉండటం లేదు. కేటాయింపులు లేకపోవడంతో సహకార పరపతి సంఘాల్లోనూ నిల్వలు నిండుకుంటున్నాయి.
అంతా భరోసా కేంద్రాల మయం:
విత్తనం నుంచి అమ్మకం వరకు అంతా రైతు భరోసా కేంద్రాలే (ఆర్‌బీకే) అంటున్న సర్కారు వైఖరితో వ్యవసాయశాఖ అధికారులు కూడా అదే పల్లవి పాడుతున్నారు. గతంలో ప్రాథమిక సహకార పరపతి సంఘాల ద్వారా ఎరువులు విక్రయించేవారు. రైతులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి తీసుకెళ్లేవారు. గతేడాది నుంచి వ్యవసాయశాఖ వీటికి కేటాయింపులు తగ్గించింది. దీంతో అక్కడ ఎరువులు లేవనే సమాధానమొస్తోంది. ఆర్‌బీకేలకు వెళ్తే ఆర్డరు పెట్టి తెప్పించి ఇస్తామని చెబుతున్నారు. అవి ఎప్పటికి వస్తాయనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సహకార సంఘాలకు 80వేల టన్నుల ఎరువులు సరఫరా చేస్తే.. ఆర్‌బీకేలకు 1.04 లక్షల టన్నుల ఎరువులు ఇచ్చారు.
* ఆర్‌బీకేల్లో పనిచేసే వ్యవసాయ సహాయకులకు వేర్వేరు బాధ్యతలున్నాయి. వారు కార్యాలయాలకు వచ్చి ఎరువులను అమ్మి వచ్చిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసి..ఆన్‌లైన్‌లో నమోదు చేస్తేనే మళ్లీ ఎరువుల బస్తాలు పంపిస్తారు. కొన్ని చోట్ల నమోదులో జాప్యం జరుగుతోంది. మరికొన్ని చోట్ల నమోదు చేసినా సాంకేతిక కారణాలతో తప్పుగా కన్పిస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో కొన్ని ఆర్‌బీకేల్లో ఎరువుల నిల్వలే లేవు. కొన్నింటికి ఎరువులు వచ్చినా.. అధికార పార్టీ నేతల ఇళ్లకు వెళ్లిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇతర ఉత్పత్తులు కొంటేనే డీఏపీ:
దుకాణాల్లో డీఏపీ బస్తా కొనాలంటే గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా తదితర జిల్లాల్లో రూ.1,500 వరకు ఉంది. ఎమ్మార్పీ ధర రూ.1,350 ఉంటే.. అదనంగా రూ.150 వసూలు చేస్తున్నారు. నానో యూరియా, ఇతర ఫోలియర్ స్ప్రేలు కొంటేనే డీఏపీ ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో రైతులు వాటికి రూ.300 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
* రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేసే ఎరువులకు రవాణా ఖర్చుల్ని ప్రభుత్వం భరిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే తయారీ సంస్థలు తమకు గతంలో రవాణా ఖర్చులు ఇచ్చినా.. తర్వాత తగ్గించేశారని వ్యాపారులు అంటున్నారు. దీంతో ఒక్కో బస్తాపై రూ.70 నుంచి రూ.80 వరకూ అదనపు భారం తప్పడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ సమస్య వ్యవసాయశాఖకు తెలిసినా పట్టించుకోవడం లేదంటున్నారు.
డీఏపీకి అధిక డిమాండు.. సరఫరా లోటు: డీఏపీ ధర గతేడాదితో పోలిస్తే బస్తాకు రూ.150 చొప్పున పెరిగింది. దీనిపై ప్రభుత్వ నియంత్రణ ఉండటంతో కొంతమేర మాత్రమే పెరిగింది. మిశ్రమ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ధర గణనీయంగా పెరిగింది. ఏకంగా ఒక్కో బస్తాపై రూ.825 వరకు పెరిగింది. 20-20.0 రకం ఎరువుల బస్తా ధర రూ.495 పెరిగింది. దీంతో రైతులకు డీఏపీ ధర మాత్రమే అందుబాటులో ఉంది. అయితే సరిపడా సరఫరా లేదు. ఖరీఫ్ కాలానికి 2.25 లక్షల టన్నుల డీఏపీని కేంద్రం కేటాయించింది. ఇందులో ఆగస్టు మూడో వారానికి 1.25 లక్షల టన్నుల అమ్మకాలు సాగాయి. ఆగస్టు లక్ష్యంతో పోలిస్తే సరఫరా 40వేల టన్నులు తగ్గింది.
రైతులు ఇబ్బంది పడుతున్నారు:
‘రాష్ట్రంలో సరిపడా డీఏపీ అందుబాటులో లేదు. పత్తి, మిరప తదితర పంటలకు ఎరువులు వేసే కీలక సమయం ఇది. రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా సరఫరా చేయడంపై దృష్టి పెట్టాలి. ఎమ్మార్పీకి మించి అమ్మవద్దని వ్యాపారులకూ తెలియజేశాం. రవాణా ఖర్చుల భారాన్ని కూడా ప్రభుత్వం పరిష్కరించాలి’ - వజ్రాల వెంకట నాగిరెడ్డి, అధ్యక్షుడు రాష్ట్ర ఎరువులు, పురుగు మందులు విత్తన డీలర్ల సంక్షేమ సంఘం
ఇవీ చదవండి: