రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాల్లో కర్ఫ్యూను పలువురు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. పలు చోట్ల నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు.
కరోనా విలయతాండవం చేస్తుండటంతో ప్రతి ఒక్కరూ నివాసాలకే పరిమితం కావాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. కడపలో కొనసాగుతున్న కర్ఫ్యూను ఎస్పీ మధ్యాహ్నం పరిశీలించారు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఆపి.. ఎక్కడికి వెళ్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్లమీద అనవసరంగా తిరగవద్దని ఎస్పీ వారికి సూచించారు. దుకాణ సముదాయాలను, ఇతర వ్యాపార కార్యకలాపాలను మధ్యాహ్నం 12 గంటల లోపే మూసివేయాలని హెచ్చరించారు. కరోనా నిబంధనలు వ్యతిరేకిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
ఒంగోలులో..
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. మధ్యాహ్నాం 12 గంటల తర్వాత తిరిగే వాహనాలను సీజ్ చేస్తామని తాలుకా పట్టణ ఎస్సై సోమశేఖర్ హెచ్చరించారు. నిబంధన సమయం తర్వాత బయటికి వచ్చిన వారిని ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వాహనాలను నిలిపివేస్తున్నామని.. కరోనా నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోకపోతే యజమానులకు జరిమాన విధిస్తామని అన్నారు.
పోలీసుల హెచ్చరికలు బేఖాతరు..
మధ్యాహ్నాం 12 గంటల తర్వాత రోడ్డు పైకి వాహనాలు రావద్దని చెప్పినా.. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జనాలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీనిపై ఆగ్రహించిన పోలీసులు వాహనదారులు ఆపి కౌన్సెలింగ్ నిర్వహించారు. కొందరికి జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
నిబంధనల ఉల్లంఘన..
పశ్చిమగోదావరి జిల్లా టీ.నరసాపురం మండలం రాజుపోతేపల్లి క్రాస్ రోడ్డులో నిబంధనలు పాటించకుండా దుకాణాలు నిర్వహిస్తున్నారు. కామవరపుకోట, లింగపాలెం మండలాల నుంచి వచ్చిన వ్యక్తులు దుకాణాలు లోపల ఉంచి.. వారికి అవసరమైన వస్తువులు, ఆహార పదార్థాలు అందిస్తున్నారు. దీంతో ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలు మూయకుండా వ్యాపారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. దుకాణాలు తెరిచి యథేచ్ఛగా విక్రయాలు జరుపుతుండటంపై పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కొన్ని దుకాణల్లోన్ని వస్తువులను చిందరవందరగా పడేశారు. మరోసారి ఇదే విధంగా కొనసాగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఎమ్మిగనూరులో..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోలీసులు, అధికారులు కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రహదారుల్లో ద్విచక్ర వాహనాలు తిరగుతున్న.. వాహనదారులకు జరిమానా విధించారు.
ఇదీ చదవండి: