ఏళ్లు గడుస్తున్నా.. రాష్ట్ర ఖజానా శాఖకు సంబంధించిన కోట్ల రూపాయలు రికవరీ కావడం లేదు. శాఖాపరమైన విచారణలు నామమాత్రమే అవుతున్నాయి. గట్టి చర్యలు తీసుకుంటారనే భయం లేకపోవడం వల్ల అక్రమాలు పునరావృతమవుతూనే ఉన్నాయి.
రూ.కోట్లలో అక్రమాలు
పింఛనర్లకు, తెలంగాణకు చెందిన వారికీ ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మధ్యంతర భృతి చెల్లింపులు రెండేళ్లుగా కొనసాగాయి. కొన్నిచోట్ల 70 ఏళ్లు నిండకముందే అదనపు పింఛను జమ చేసిన ఉదంతాలున్నాయి. వివిధ జిల్లాల్లో పదేళ్లలో అనేక చోట్ల కుంభకోణాలు వెలుగుచూశాయి. విశాఖ జిల్లా చింతపల్లి, సీతమ్మధార, గుంటూరు జిల్లా తెనాలి, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, అడ్డతీగల, ఒంగోలు.. ఇలా అనేక ఖజానా కార్యాలయాల్లో పింఛన్ల పేరుతో కుంభకోణాలు బయటపడ్డాయి. చనిపోయిన పింఛనుదారుల పేరిట భారీగా సొమ్ము స్వాహా చేశారు. కొత్త ఖాతాలు తెరిచి పింఛను సొమ్ము మళ్లించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.75 కోట్ల మేర సొమ్ము దుర్వినియోగమైంది. వాస్తవంగా ఈ మొత్తం రూ.100 కోట్లకు పైమాటేనని చెబుతున్నారు. ఒక్క విశాఖ జిల్లాలోనే రూ.45 కోట్ల మేర పక్కదారి పట్టింది. చింతపల్లిలో వైద్యబిల్లుల పేరుతో దాదాపు రూ.30 కోట్లు స్వాహా అయ్యాయి. ఇందుకు కారణమైన ఒక ఉన్నతోద్యోగిని రాజకీయ జోక్యంతో మరో శాఖలో జిల్లాస్థాయి అధికారిగా నియమించారు. గోదావరి జిల్లాల్లో కొన్ని అక్రమాల్లో భాగస్వామ్యమున్న అధికారిని ఇప్పటికీ కేంద్ర కార్యాలయంలో కీలక విధుల్లో వినియోగించుకుంటున్నారు.
తనిఖీలు సక్రమంగా లేక..
ఒక కోస్తా జిల్లాలో రూ.80 లక్షల సొమ్మును ఖజానా అధికారి ఒకరు ఇటీవల సొంత ఖాతాకు మళ్లించడంతో ఆయన్ను ఇటీవల సస్పెండ్ చేశారు. అంతర్గత తనిఖీలు సరిగా లేక అవకతవకలు జరిగాయంటూ చర్యలు తీసుకున్నారు. కోస్తా జిల్లాలో ఒక ఖజానా కార్యాలయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ జూనియర్ అసిస్టెంట్ ఒకరిని 12 ఏళ్ల కిందట సస్పెండ్ చేశారు. అప్పటినుంచి సస్పెన్షన్‌ను కొనసాగిస్తూ సగం జీతం చెల్లిస్తున్నారు. సాధారణంగా సస్పెన్షన్‌లో ఉన్న ఉద్యోగికి నిబంధనల ప్రకారం రెండేళ్ల తర్వాత దూరంగా బదిలీ చేసి పని చేయించుకోవాలి. ప్రస్తుతం ఆయనపై కేసు వీగిపోవడంతో పూర్తి వేతనమివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు అంతర్గత తనిఖీలు సరిగ్గా చేయకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయనే విమర్శలున్నాయి.
ఇదీ చదవండి: