కడప జిల్లాలో..
పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడంలో కడప జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పుడూ ముందుంటుందని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు.
ఉమేష్ చంద్ర కళ్యాణమండపంలో 45 సంవత్సరాలు దాటిన పోలీస్ కుటుంబసభ్యులకు ఎస్పీ ఆధ్వర్యంలో మొదటి విడత కరోనా టీకా వేయించారు.
విశాఖ జిల్లాలో..
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ వ్యాక్సినేషన్(Covid vaccination) కార్యక్రమం చురుగ్గా సాగింది. చీడికాడ ఆసుపత్రిలో 200 మందికి టీకాలు వేశారు. పలు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, 45 ఏళ్లు నిండిన ప్రజలకు వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి సునీల్ కుమార్ చెప్పారు.
'నిర్లక్ష్యం వద్దు'
45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని.. నిర్లక్ష్యం తగదని నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పేర్కొన్నారు. నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియం ఆవరణలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు .
శ్రీకాకుళం జిల్లాలో..
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కొవిడ్ వ్యాక్సినేషన్(Covid vaccination) కార్యక్రమాన్ని ఆర్టీవో కిషోర్ పరిశీలించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు.
కృష్ణా జిల్లాలో..
జిల్లాలోని నందిగామలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రం వద్ద టీకా వేంచుకునేందుకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లింగాలపాడు, గొళ్లమూడి పీహెచ్సీ పరిధిలో కేవలం కంచల, కొండూరు గ్రామ ప్రజలకు మాత్రమే టీకాలు వేస్తామని చెప్పటంతో ప్రజలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఆ రెండు గ్రామాల్లో కలిపి 200 మందికి టీకాలు వేస్తామని మిగిలిన గ్రామాల వాళ్లు నందిగామ పట్టణానికి వెళ్లిపోవాలని అధికారులు స్పష్టం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలంలో కరోనా టీకా ప్రక్రియ కొనసాగింది. 6 కేంద్రాల్లో టీకాలు వేశారు. తహసీల్దార్ ఎలీసా ఆయా కేంద్రాలను తనిఖీ చేశారు. కరోనా టీకాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ పరిధిలోని వెల్లటూరు, భట్టిప్రోలు, కొల్లూరులో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను తెనాలి డివిజన్ సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ పరిశీలించారు. వ్యాక్సిన్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ ఇచ్చే క్రమంలో ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు