కొందరు ప్రభుత్వ సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం కొవిడ్ బాధితుల్ని బలి తీసుకుంటోంది. అలాంటి ఘటనే హైదరాబాద్ నగర పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మల్లాపూర్ డివిజన్ ఓల్డ్ మల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(50) కరోనా సోకిందేమోననే అనుమానంతో గత శనివారం పరీక్షల కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అక్కడి సిబ్బంది కిట్లు లేవని తిప్పి పంపారు. తిరిగి సోమవారం, మంగళవారం వెళ్లగా కిట్లు అయిపోయాయనే సమాధానమిచ్చారు.
గురువారం అస్వస్థతకు గురికావడం వల్ల బాధితుడి అన్న కుమార్తె ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు. ‘వాళ్లు రూ.లక్ష కడితేనే ఆసుపత్రిలో చేర్చుకుంటామన్నారు. స్తోమత లేకపోవడం వల్ల ప్రభుత్వ కొవిడ్ కంట్రోల్ రూంను సంప్రదించాం. అక్కడి సిబ్బంది ‘‘మరేం పర్లేదు.. ఆవిరి పట్టుకోండి’’ అనే సమాధానమిచ్చి ఫోన్ పెట్టేశారు. చివరికి గురువారం పొద్దుపోయాక కింగ్‌కోఠి ఆసుపత్రిలో చేర్పించాం. తర్వాత 15 నిమిషాలకే చిన్నాన్న మృతి చెందాడు’ అని యువతి కన్నీటిపర్యంతమయ్యారు.
గుండెపోటుగా ధ్రువీకరించాలంటూ ఒత్తిడి
కరోనా మృతిగా నిర్ధరించాలంటే 2 రోజులు మృతదేహాన్ని ఇక్కడే ఉంచాల్సి వస్తుందని, గుండెపోటుతో మరణించినట్లు ధ్రువీకరించేందుకు అంగీకరిస్తే వెంటనే ఇస్తామని అక్కడి వైద్యులు తమతో బేరాలు అడారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఒత్తిడితో గుండెపోటుగా ధ్రువీకరించేందుకు అంగీకరించామన్నారు.
ఇదీ చదవండి: