COVID IN AP: రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. గత వారం నుంచి రోజుకు 1,750 నుంచి 2,000 వరకు చేస్తున్న నిర్ధారణ పరీక్షల్లో 5శాతం వరకు పాజిటివిటీ నమోదవుతోంది. 50 మంది వరకు రోగులు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురు వ్యాధిగ్రస్తులు ఇంటి వద్దే చికిత్స చేయించుకుంటున్నారు. మొత్తంగా రెండువేల క్రియాశీల కేసులున్నాయని అంచనా. కేసులు క్రమేపీ పెరుగుతుండటం నాలుగో వేవ్‌కు సంకేతమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రక్షణ నిబంధనలు గాలికి..: కరోనా నిబంధనలను విస్మరించిన ఫలితం వ్యాధి క్రమేణా విస్తరించడానికి కారణమవుతోంది. చాలామంది మాస్కులు ధరించక స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రద్దీ కూడళ్లలోనూ రక్షణ చర్యలు పాటించడం లేదు. ఏటా వర్షాకాలంలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్, అతిసారం, చికున్‌గన్యా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయి. ఈ వ్యాధుల లక్షణాలు, కొవిడ్ లక్షణాలు ఇంచుమించు ఒకేలా ఉంటున్నందున వెంటనే వైద్యులను సంప్రదించి నిర్ధారించుకొని తగిన చికిత్స పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి విశాఖ, కృష్ణా, గుంటూరు, కాకినాడ తదితర జిల్లాల్లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఒక్క విశాఖలోనే సుమారు 500 క్రియాశీల కేసులున్నట్లు అంచనా. కృష్ణా జిల్లాలో 150, గుంటూరు జిల్లాలో 60, ప్రకాశం జిల్లాలో 30, చిత్తూరు జిల్లాలో 50 వరకు క్రియాశీల కేసులున్నట్లు ఆయా జిల్లాల నుంచి సేకరించిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. పలు ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు చికిత్సనందించే క్రమంలో చేస్తున్న పరీక్షల్లో వారికి పాజిటివిటీ నిర్ధారణ అవుతోంది. ఇది వైద్యులు, సిబ్బందికీ సంక్రమిస్తోంది.
బులెటిన్ అవసరం: కేసులు తగ్గాయన్న ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీగా బులెటిన్ జారీని మే తొలివారం నుంచే నిలిపేసింది. ప్రస్తుతం మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నందున ప్రజలను అప్రమత్తం చేసేందుకు రోజువారీ బులెటిన్ జారీ చేయాల్సి ఉంది. నిర్ధారణ పరీక్షలను పెంచాల్సి ఉంది. పరీక్షలు తగ్గితే వైరస్‌లోని ప్రమాదకర ఉత్పరివర్తనాలు బయటపడవని, ఇది చికిత్సకు ఇబ్బందికరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో గతంలో రోజూ లక్ష వరకు నమూనాలను పరీక్షించేవారు. ఇవి బాగా తగ్గాయి. ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేస్తున్న నిర్ధారణ పరీక్షలను కూడా పర్యవేక్షించాల్సి ఉంది.
లక్షణాలు కనిపిస్తే దూరంగా ఉండాలి: కొవిడ్ లక్షణాలు కనిపిస్తే ముందుగా కుటుంబీకులకు దూరంగా, విడిగా గదిలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి. చేతుల శుభ్రత ముఖ్యం. 60ఏళ్లు దాటినవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తప్పనిసరైతేనే తగిన జాగ్రత్తలతో బయటకు రావాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాధిగ్రస్తులు వైద్య నిపుణుల సూచనలతో మందులు వాడుతూ పోషకాహారాన్ని తీసుకోవాలి.
ఇవీ చదవండి: