వేతన సవరణపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలు వెనక్కు తీసుకోవాలని.. రాష్ట్ర న్యాయశాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఆర్.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. వేతన సవరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న పీఆర్సీ సాధన సమితికి.. మద్దతు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సీపీఎస్ రద్దు చేయాలన్నారు. పీఆర్సీ సాధన సమితి తలపెట్టే కార్యక్రమాల్లో 13 జిల్లాల్లోనూ న్యాయశాఖ నాలుగో తరగతి ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు.
మెరుపు సమ్మె చేయడానికి వెనకాడబోం..
రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో మెరుపు సమ్మె చేయడానికి వెనకాడబోమని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఛైర్మన్ చంద్రశేఖర్ ప్రకటించారు. కడపలో రాష్ట్రస్థాయి విద్యుత్ ఉద్యోగుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు సదస్సుకు హాజరయ్యారు. 13 అంశాలతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచినా.. పరిష్కారానికి చొరవచూపడం లేదని ఆక్షేపించారు.
నెల్లూరు కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసే విధంగా మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఉద్యోగుల ఉద్యమానికి సంఘీభావంగా సోమవారం విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలో పాల్గొంటారని చంద్రశేఖర్ ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగల డిమాండ్లపై సోమవారం యాజమాన్యానికి నోటీసు అందిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: ap electricity employees: '19 నెలలుగా జీతాల్లేవు.. ఇక్కడ తీసుకోరు.. అక్కడ చేర్చుకోరు.. ఎట్లా బతకాలి'