Govt Approves Double Decker Metro Rail For Vijayawada And Visakhapatnam : మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో భాగంగా విశాఖపట్నం, విజయవాడలో 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయబోతున్నారు. విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మధ్య మొత్తం 19 కి.మీ. పొడవున, విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.70 కి.మీ. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేలా కొత్త డిజైన్లను ప్రతిపాదించారు.
మెట్రో రైల్ ప్రాజెక్టులపై గురువారం సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ఆమోదించారు. రెండు ప్రాజెక్టులపైనా అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 2017 మెట్రో రైల్ విధానం ప్రకారం విశాఖ, విజయవాడలో మొత్తం 142.90 కి.మీ. పొడవునా చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్టులకు 100% నిధులు కేంద్రం సమకూర్చేలా సంప్రదింపులు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఇదే విధానంలో కోల్‌కతాలో 16 కి.మీ. మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.8,565 కోట్లు కేంద్రమే సమకూర్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనూ రాష్ట్రానికి మెట్రో రైల్ ప్రాజెక్టు ఉందని సీఎం అన్నారు. ఆ చట్టప్రకారమైనా 2017 మెట్రో విధానంలోనైనా కేంద్రం సాయం చేయాలని, ఈ మేరకు సంప్రదింపులు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్ - మెట్రో ప్రాజెక్టు మొదటి దశ ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం
రెండు నగరాల్లోనూ నాలుగేళ్లలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా పని చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించి, కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.
డబుల్ డెక్కర్ మోడల్ అంటే ఇలా ఉంటుంది : కింద రోడ్డు, దానిపై ఫ్లైఓవర్ (పైవంతెన), ఆపైన మెట్రో ట్రాక్ రానుంది. మొత్తంగా 18 మీటర్ల ఎత్తులో కొన్ని చోట్ల మెట్రో రైల్ నడవనుంది. రోడ్డుపై 10 మీటర్ల ఎత్తున మెట్రో రైల్ నడిచేలా తొలుత ప్రతిపాదించారు. జాతీయ రహదారిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పలు చోట్ల కేంద్రం పైవంతెనలు ప్రతిపాదించింది. విజయవాడ, విశాఖ నగరాల మధ్యలో నుంచి వెళ్లే జాతీయ రహదారిలోనూ కొన్ని చోట్ల పైవంతెనలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ఇలాంటి ప్రాంతాల్లో మారిన కొత్త డిజైన్ ప్రకారం మెట్రో రైల్ 18 మీటర్ల ఎత్తులో వెళ్లనుంది. దీని ప్రకారం కింద రోడ్డుకు 10 మీటర్ల ఎత్తులో ఫ్లైఓవర్, దానిపై మరో 8 మీటర్ల ఎత్తులో మెట్రో ట్రాక్ రానుంది. పైవంతెన దాటాక మళ్లీ 10 మీటర్ల ఎత్తులోనే మెట్రో రైలు నడవనుంది. ఈ తరహా మోడళ్లు పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.
విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు - తొలిదశ డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం