ఓ బస్టాండ్ నుంచి మరో బస్టాండ్ వరకు కొరియర్ కవర్లు, కార్గో పార్శిల్ సేవలు అందిస్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ.. ఇక గ్రామీణ ప్రాంతాలకు కూడా వీటిని విస్తరించనుంది. చిన్న పట్టణాలు, పల్లెలకు వెళ్లే బస్సుల్లో కండక్టర్ ద్వారా కిలో లోపు బరువు ఉండే కవర్లు పంపేందుకు వీలు కల్పించనుంది. ఇందులో భాగంగా కండక్టర్ల వద్ద ఉండే టికెట్ల జారీ యంత్రాల(టిమ్స్)లో కొరియర్ బుక్‌చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి టిమ్ ద్వారా రశీదు ఇస్తారు. వీటిని బుక్‌చేసుకున్న వారు.. దానిని అందజేయాల్సిన చిరునామాను కవరుపై రాయడమే కాకుండా, సంబంధిత వ్యక్తులకు ఫోన్‌చేసి బస్సు వచ్చే సమయానికి సిద్ధంగా ఉండాలని తెలియజేయాల్సి ఉంటుంది. ఆ బస్టాప్‌లో కండక్టర్/డ్రైవర్ వీటిని అందజేస్తారు.
టిమ్స్ ద్వారా కొరియర్ కవర్ల బుకింగ్‌ను వారంలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రధాన బస్టాండ్లలో ఆర్టీసీ కొరియర్, కార్గో సేవలు ఉండగా, అన్ని జిల్లా కేంద్రాలతోపాటు విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి నగరాల్లో డెలివరీ సదుపాయం కూడా కల్పించారు. గ్రామాలు, చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉండేవారికి సైతం ఆర్టీసీ ద్వారా కొరియర్ సేవలు అందించేందుకు కొత్తగా దీనిని అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి కార్గో ద్వారా నిత్యం సగటున రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తోంది.
ఇదీ చూడండి: పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..