కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేళ గరిష్ఠంగా రోజుకు 17 వేల వరకూ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇందుకోసం అన్ని వనరుల్ని వినియోగించుకోనున్నట్టు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ సూచనల మేరకు క్షయవ్యాధి నిర్ధారణకు వినియోగించే ట్రూనాట్ యంత్రాలను కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రోజూ వెయ్యి వరకూ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.
వాస్తవానికి లాక్ డౌన్ తర్వాత ఎక్కువ పరీక్షలు నిర్వహిచాల్సి ఉందని.. తక్కువ పరీక్షలు నిర్వహించి వైరస్ వ్యాప్తి లేదని అనుకోవటం మనల్ని మనం మభ్యపెట్టుకోవటమేనని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల్లో 503 కేసులు 94 మండలాల పరిధిలోనే విస్తరించి ఉన్నాయని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రతి నిర్ధారణ పరీక్ష ఆన్‌లైన్లో నమోదు అవుతోందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1500 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని మరిన్ని కొనుగోలు చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ వివరిచింది.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగితే క్వారంటైన్ కేంద్రాలను కరోనా కేర్ సెంటర్లుగా మార్పు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా రోగుల నిర్వహణా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామని.. నిపుణులైన వైద్యుల బృందం రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్టు తెలియచేసింది. దేశవిదేశాల్లో చికిత్స విధానాలను తెలుసుకునేందుకు అమెరికాలోని వైద్యులు, ఏపీ వైద్యులతో కూడిన ఓ వాట్సప్ గ్రూప్ ను కూడా ఏర్పాటు చేసినట్టు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి తెలిపారు. కరోనా కారణంగా అవుట్ పేషెంట్ సేవలకు ఇబ్బంది కలుగుతున్నందున ప్రజలు టెలీమెడిసిన్ సేవల్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి - కొత్తగా 9 కేసులు